అనంతపురం జిల్లా కదిరి పురపాలక కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పట్టణంలోని సమస్యలపై చర్చించాల్సిన సభ్యులు.. వాటిని పక్కనపెట్టి పరస్పరం వాగ్వాదానికి దిగారు. పట్టణ ప్రణాళిక పర్యవేక్షకుడు (టీపీఓ) రహమాన్పై వైకాపా సభ్యులు అవినీతి ఆరోపణలు చేశారు. టిపీఓ సభ్యులకు కనీసం గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైకాపా నాల్గవ వార్డు సభ్యుడు కృపాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్లాన్ ఇచ్చిన భవనాలకే.. డబ్బులు డిమాండ్ చేస్తూ ఆక్రమణ పేరుతో తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించాలని సభ్యులు పట్టుబట్టారు. నాలుగో వార్డు సభ్యుడుకి మద్దతుగా మరికొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు టీపీఓపై ధ్వజమెత్తారు. ఓ దశలో పట్టణ ప్రణాళిక అధికారిపై దూషణలకు దిగారు.
ఇదే సమయంలో.. టీపీఓ రహమాన్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. చెప్పిన మాట వినలేదనే ఉద్దేశంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తే అంగీకరించేది లేదని సభ్యుల వైపు దూసుకెళ్లారు. అధికార పార్టీకి చెందిన కొందరు సభ్యులు.. తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పర ఆరోపణలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది. మిగతా సభ్యులు, మున్సిపల్ సిబ్బంది కల్పించుకుని టీపీఓను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.