ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్షా 48 వేల టన్నుల ఎరువుల కోసం ప్రణాళిక - ఎరువులకు పెరుగుతున్న డిమాండ్

అనంతపురం జిల్లాలో ఎరువులకు డిమాండ్ పెరుగుతోంది. వేసవిలో సాగు కోసం భూములు సిద్ధం చేసుకున్న రైతులు సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు ముంచెత్తడంతో విత్తనాలు వేయటం ప్రారంభించారు. ఈసారి ఖరీఫ్‌లో 6 లక్షల 70వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన వ్యవసాయశాఖ..లక్షా 48 వేల టన్నుల ఎరువులు కావాలని ప్రణాళిక రూపొందించింది. ఇందులో కనీసం 50 శాతం రైతు భరోసా కేంద్రాల నుంచే విక్రయించాలని నిర్ణయించారు. అయితే నగదు చెల్లించి తీసుకోవాల్సి ఉన్నందున.. చాలామంది రైతులు అప్పు ఇస్తున్న దుకాణాల వద్దకే వెళ్లి తెచ్చుకుంటున్నారు.

fertilizer
fertilizer

By

Published : Jun 12, 2021, 4:56 PM IST

ఎరువులకు పెరిగిన డిమాండ్

అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగు వేగం పుంజుకుంది. వారం రోజులుగా వర్షాలు కురవటంతో జిల్లాలో విత్తనం వేయటానికి భూమి పదునైంది. రైతులు ఎరువుల కొనుగోలు మొదలు పెట్టారు. ఈసారి జిల్లాలో ఖరీఫ్ కోసం లక్షా 47 వేల మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు తక్కువ ధరకే ఇవ్వటానికి మార్క్​ఫెడ్ నిర్ణయించింది.

గతంలో రైతులు ఆర్బీకేల్లో డబ్బులు చెల్లించిన తర్వాత, రెండు రోజులకు ఎరువులు పంపించేవారు. ఈసారి ఆర్బీకేల పరిధిలోనే గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి, రైతులు డబ్బు చెల్లించిన వెంటనే ఎరువులు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, కచ్చితమైన తూకంతో ఆర్బీకేల్లో ఇస్తున్నామని..రవాణా ఖర్చులు కూడా మిగులుతాయని మార్క్​ఫెడ్ అధికారులు చెబుతున్నారు.

అయితే..నగదు చెల్లించి ఎరువులు తీసుకోవాల్సి ఉన్నందున రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతోంది. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఎరువుల దుకాణాల్లో అప్పుతో కొనుగోలు చేస్తున్నారు. ఆర్​బీకేల్లో ఎరువుల కొనుగోలు కోసం పంట రుణం తరహాలో రైతులకు వెసులుబాటు కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. ఆదాయం లేక కుంగుతున్న పేదలు!

ABOUT THE AUTHOR

...view details