అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువు సమీపంలో ఎమ్ఎస్ఎమ్ఈ పేరిట పేదలకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటుకు గత ప్రభుత్వం 2016 శ్రీకారం చుట్టింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా ముత్యాల చెరువు గ్రామానికి సమీపంలోని హిందూపురం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 962 సర్వేనెంబర్ లోని దాదాపు 69 ఎకరాల భూమిని గుర్తించింది. 57 మంది రైతులకు చెందిన ఈ భూములను పరిశ్రమ కోసం తీసుకునేందుకు గ్రామస్తులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
మొదటి దశ 30 మంది రైతులకు పరిహారాన్ని వారి ఖాతాలో జమ చేసింది. ఈలోగా అ ప్రభుత్వం మారడంతో ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమ ఏర్పాటు అంశం అటకెక్కింది. కదిరి మండలం కే. బ్రాహ్మణ పల్లి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా చెర్లోపల్లి జలాశయం నిర్మాణం పూర్తయింది. 2018 లోనే జలాశయానికి కృష్ణా జలాలు చేరాయి. దీంతో ఈ ప్రాంతంలో సాగు భూముల ధరలు అమాంతం పెరిగాయి. సాగు చేసుకుంటున్న భూమి పరిశ్రమ కోసం ప్రభుత్వం తీసుకున్నా... ఉపాధినిచ్చే పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు మార్కెట్ విలువ ఆధారంగా తమ భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.