Farmers affected by rains: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి.. మల్లాపురంలో అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ ఈదురు గాలులకు పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. గ్రామంలో ప్రసిద్ధి చెందిన విప్లమలై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఇనుప రేకులు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మల్లాపురం గ్రామంలో హనుమంత రెడ్డి, ధర్మన్న అనే రైతులు 13 ఎకరాల్లో అరటి పంట సాగు చేయగా, చేతికొచ్చిన అరటి పంట 11 ఎకరాల మేర నేలకొరిగింది. దీంతో దాదాపు రూ 12 లక్షల మేర కష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వడగళ్లు, గాలి వాన బీభత్సానికి తన నాలుగు ఎకరాల పంట పూర్తిగా నాశనం అయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కుందుర్పి మండలం పెసరపల్లి గ్రామానికి చెందిన రైతు వీరపాచికి చెందిన నాలుగు ఎకరాల బొప్పాయి తోట పూర్తిగా వర్షానికి తుడిచిపెట్టుకుపోయింది. ఆదివారం సాయంకాలం తీవ్ర గాలులతో పాటు వడగళ్ల వానకు బొప్పాయి తోట పూర్తిగా ధ్వంసమైంది. ఉదయాన్నే పంట పొలానికి వెళ్లిన రైతు పంట పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
శ్రీ సత్య సాయి జిల్లాలో.. బత్తలపల్లి ధర్మవరం మండలాల్లో గాలి వడగండ్ల వాన బీభత్సానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. బత్తలపల్లి మండలం వెంకట్గారిపల్లికి చెందిన రైతు బోయపాటి లక్ష్మీనారాయణ 8 ఎకరాలలో బొప్పాయి సాగు చేయగా.. వడగండ్ల వానకు తన పంట దెబ్బతినడంతో.. రూ 10 లక్షల పెట్టుబడి నేలపాలైందని రైతు ఆవేదన చెందుతున్నాడు. గ్రామంలో మరికొందరు రైతులకు చెందిన బొప్పాయి అరటి పంటలు నష్టం వాటిల్లాయి.