అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని రంగేపల్లి సమీపంలో రైల్వే డబుల్ లైన్ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను తీసుకున్నారు. గత 4 సంవత్సరాలుగా పరిహారం చెల్లించకుండా గుత్తేదారులు పనులు చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. దీంతో రంగేపల్లి గ్రామానికి చెందిన 24 మంది రైతులు పనులను అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న సోమందేపల్లి ఎమ్మార్వో సురేష్ కుమార్, ఎస్సై వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని రైతుల సమస్యలపై ఆరా తీశారు. పరిహారం చెల్లించకుండా భూములు లాక్కుంటే.. తమకు ఆత్మహత్యే శరణ్యమని పలువురు రైతులు చేతిలో పురుగు మందు సీసాలను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించడంపై ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇవ్వగా.. వారు శాంతించారు.