కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కర్బూజ, ద్రాక్ష, దోస పంటల దిగుబడిని మార్కెట్కు తరలించలేక.. అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ అనే రైతు పది ఎకరాల్లో దోసను సాగు చేశారు. వంద టన్నుల పైగానే దిగుబడి వస్తుందని రైతు ఆశాభావంతో ఉన్నాడు. కానీ.. ఆ పంటను కొనేవారు లేరని... బహిరంగ మార్కెట్లో అమ్ముకుందామంటే రవాణా వ్యవస్థ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరో వారం పది రోజుల్లో దోసకాయ పంట కూడా కోతకు వస్తుందని ఏం చేయాలో దిక్కు తోచడం లేదని రైతు ఆందోళన చెందుతున్నాడు. ద్రాక్ష సాగు చేసిన మరో రైతు కూడా మార్కెటింగ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటను మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.