Cheeni Crop Price Issue in Anantapur: అనంతపురం పండ్ల మార్కెట్ యార్డులో మండీ వ్యాపారులే దళారుల అవతారం ఎత్తారు. రైతులు తీసుకొచ్చిన చీనీ పంటకు వేలం లేకుండా ధర నిర్ణయిస్తున్నారు. పంట అమ్మితే కనీసం పెట్టుబడి రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం మండీ వ్యాపారులను రైతులు నిలదీశారు. అధిక ధరలకు అమ్ముకోవాలని మార్కెట్కు వస్తే ఇక్కడ మాత్రం మండీ వ్యాపారులు, ఇతర రాష్ట్ర వ్యాపారులను రానీయకుండా ధర నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు. కేవలం మండీ నిర్వహిస్తున్న వారు ధర ఏ విధంగా నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాదన చెలరేగి.. ధరలు నిర్ణయించడాన్ని అరగంట పాటు ఆపేశారు.
ఈ క్రమంలో అనంతపురం పండ్ల మార్కెట్లో మండీ వ్యాపారులు.. తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి మార్కెట్కు పండ్లను తీసుకువస్తే ఇక్కడ మండీ వ్యాపారులు ఒక సిండికేట్గా మారి బయట వ్యాపారులను రానీయకుండా తక్కువ ధరను నిర్ణయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలతో సంబంధం లేకుండా... కేవలం నోటి మాటలతో ఇష్టమొచ్చిన ధరలు చెబుతున్నారని మండిపడుతున్నాకు. మార్కెట్‌లో టన్ను చీనీ ధర 40 వేలు నడుస్తుండగా అనంతపురం పండ్ల మార్కెట్‌లో మాత్రం కేవలం 12 వేలు, 13 వేలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.