strong winds and torrential rain : ప్రకృతి విపత్తుల కారణంగా వ్యవసాయం గాలిలో దీపమైంది. ఆరుగాలం చెమటోడ్చి ఆకలి తీర్చే అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. వానాకాలం వస్తే చాలు.. చినుకు తడి కోసం ఆకాశానికేసి చూసే రైతన్నలు.. చివరికి అకాల వర్షాల కారణంగా కంటతడి పెడుతున్నారు. రేయింబవళ్లు చిందించిన స్వేదం ఫలితంగా పంట చేలు నిండుగా కళకళలాడుతున్న వేళ.. ప్రకృతి ప్రకోపించింది. ఈదురు గాలులు, వడగండ్లతో విరుచుకుపడింది. అరటి చెట్లు గెలలతో కూలిపోగా.. టమాట పంట కనుమరుగైంది.. మొక్కజొన్న కుప్పకూలిపోయి నేలమట్టమైంది. ఈ కష్టం ఏ ఒక్క రైతుదో కాదు.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల అన్నదాతల వ్యథ ఇది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న రైతుల గోడు పాలకుల చెవికెక్కేనా..!
"రైతే దేశానికి వెన్నెముక.. దేశానికి రైతే రాజు" అని ఎంతో మంది మేధావులు అభిప్రాయపడ్డారు. అయితే అది ప్రకటనలకే పరిమితమైంది. ఆ ప్రాంతంలో రైతు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం అందించే అపన్న హస్తం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
పంటలను పరిశీలించిన రాఘవులు.. నాలుగు రోజుల కిందట ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షానికి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాలలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దుక్కిదున్ని చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షం కారణంగా నేలపాలైంది. అరటి, బొప్పాయి, మామిడి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ నార్పల మండలంలోని వెంకటంపల్లి గ్రామంలో నష్టపోయిన రైతులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. పొలాలను స్వయంగా పరిశీలించారు. రైతులను కలుసుకొని నష్టం తీవ్రతను పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు ఇది చేశాం.. అది చేశాం అని గొప్పలు చెప్పడం కాదని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అరటి తోటలను పరిశీలిస్తే.. రైతుల పరిస్థితి చాలా హృదయ విదారకంగా కనిపిస్తోంది. రెండు రోజుల కిందట వచ్చిన ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా మండల వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. టమాట తోటలు, మొక్కజొన్న చేళ్లు దారుణంగా దెబ్బతిని ఆనవాళ్లు కోల్పోయాయి. లక్షల రూపాయల పెట్టుబడి రైతులు నష్టపోయి అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈదురుగాలుల వల్ల అరటి చెట్లు నేలకొరిగాయి. వడగండ్ల దెబ్బకు చెట్లకు గాయాలు కావడం ఇక్కడే కనిపిస్తోంది. పక్వానికి వచ్చిన అరటి గెలలు వాడిపోయి చేతికందిన పంట నేలపాలైంది. - బీవీ రాఘవులు, సీపీఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇవీ చదవండి :