ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుగుమందుల నాణ్యత పరీక్షల్లో జాప్యం.. అన్నదాతలకు అపార నష్టం - నకిలీ పురుగుమందులతో రైతుకు నష్టం

పంట సాగులో చీడపీడల నివారణకు క్రిమి సంహారక మందుల పాత్ర కీలకం. క్రిమికీటకాల్ని సంహరించి మంచి దిగుబడులు పొందడానికి ఇవి ఎంతో సహకరిస్తాయి. అయితే పురుగు మందుల నాణ్యతను పరీక్షించే విషయంలో ఏళ్లుగా వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. దుకాణాల్లో పురుగు మందుల నమూనాలు తీసి, పరీక్షలకు పంపి, వాటి నివేదికలు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ సమయంలో కంపెనీలు పురుగుమందుల్ని అమ్మడం, అవి రైతులు పంటకు వినియోగించడం, వాటిలో నాణ్యత లేకపోతే పంట నష్టం జరగడం సాధారణ విషయం అయిపోయింది.

farmers loosing crop with fake fertilizers
నకిలీ పురుగుమందులు

By

Published : Jul 9, 2020, 3:06 PM IST

వ్యవసాయానికి పెద్దపీట వేస్తామంటున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో రైతులకు జరిగే నష్టాలను నివారించలేకపోతున్నాయి. ముఖ్యంగా పురుగు మందుల నాణ్యత పరీక్షించే విషయంలో జరుగుతున్న జాప్యం అన్నదాతలను తీవ్రంగా నష్టపరుస్తోంది. దశాబ్దాల నాటి విధానం, అవే ప్రయోగశాలల కారణంగా నకిలీ, నాణ్యతలేని క్రిమిసంహారక మందులతో పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి.

ఏటా మండల వ్యవసాయశాఖ అధికారులు పురుగుమందుల డీలర్ల వద్ద పలు కంపెనీలకు చెందిన మందుల నమూనాలు తీసి, వాటిని పరీక్షల విభాగం అధికారులకు పంపుతారు. వారు ఆయా మందుల కంపెనీ లేబుళ్లు తొలగించి, తిరుపతి, గుంటూరు తదితర ప్రయోగశాలలకు కోడ్ నెంబర్లతో పంపిస్తారు. పరీక్షల తరువాత ఫలితాల నివేదికలు.. రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళతాయి. ఇలా వెళ్లిన నివేదికలను కంపెనీల వారీగా క్రోడీకరించి, నాణ్యతలేని ఆయా కంపెనీలకు చెందిన బ్యాచ్ నెంబర్ల మందుల అమ్మకాలను నిలిపివేసేలా కమిషనర్​కు ఫైల్ పంపుతారు. దీనిపై కమిషనర్ ఆమోదముద్ర వేశాక, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు, అక్కడి నుంచి మండల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు వెళతాయి. ఈ ఆదేశాల మేరకు నాణ్యతలేని, నకిలీ పురుగు మందుల అమ్మకాలను నిలిపివేయటమో, కేసులు నమోదు చేయటమో చేస్తూ చర్యలు తీసుకుంటారు.

అయితే ఇంత పెద్ద ప్రక్రియలో జాప్యం జరగడం వలన ఏటా రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. నకిలీ, నాసిరకం మందులు కొనుగోలు చేస్తూ పంటను కోల్పోతున్నారు. ఏటా ఇరవై నుంచి 25 నమూనాలు నాణ్యతలేనివిగా నిర్ధరణ చేస్తున్నట్లు ప్రయోగశాల అధికారులు చెబుతున్నారు.

పరీక్షల్లో జాప్యం.. పంట నష్టం

పంట కాలం మొదలయ్యాక మండల వ్యవసాయ అధికారులు నమూనాలు తీసుకొని, వాటి ఫలితాలు వచ్చి చర్యలు తీసుకునే సమయానికి పంటకాలమే పూర్తవుతోంది. నాణ్యతలేని మందులుగా నిర్ధరణ అయితే, రైతులు కొనుగోలు చేసిన ఆయా మందులకు సంబంధించి డబ్బులు కూడా వెనక్కు ఇప్పించే ప్రక్రియ జరగటంలేదు. మరోవైపు ఈ తరహా మందుల పిచికారి కారణంగా దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతూ రైతులు 2 విధాలా నష్టపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై వ్యసాయశాఖ దృష్టిపెట్టడం లేదు.

రైతుభరోసా కేంద్రాల్లో ఏం చేస్తారో

తాజాగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి వచ్చే మందులను ముందుగానే పరీక్ష చేసి కేంద్రాల ద్వారా రైతులకు విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వందల కంపెనీలు అనేక రకాల క్రిమిసంహారక మందులను తయారు చేసి విక్రయిస్తుంటాయి. మరి ఇన్ని రకాల మందులను ఎలా పరీక్ష చేస్తారు, ఎప్పటిలోపు పరీక్షలు పూర్తిచేస్తారనే దానిపై ఇప్పటి వరకు వ్యవసాయసాఖ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు జరిగింది రైతులను నష్టపరిచే విధానమేనని, ఇకపై ముందుగానే పరీక్షలు చేయించిన మందులనే రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రైతులు నష్టపోకుండా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేవీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవటంలేదు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను సమీక్షించే వ్యవధి ప్రభుత్వానికి లేకుండా పోతోంది. మరోవైపు రైతులకు అంతా మేలు జరుగుతోందని కిందిస్థాయి నుంచి వచ్చే నివేదికలతో సరిపుచ్చుకునే విధానం నుంచి ప్రభుత్వం బయటపడాలని రైతు సంఘాల నాయకులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి... పేద, మధ్య తరగతి వర్గాలపై కరోనా తీవ్ర ప్రభావం

ABOUT THE AUTHOR

...view details