ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాతలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్న రబీ - అనంతపురం జిల్లా వేరుశనగ రైతులు తాజా వార్తలు

ఖరీఫ్ పంటలను తీవ్రంగా నష్టపోయిన అనంతపురం రైతులు రబీ సీజన్​పై ఆశపెట్టుకున్నారు. చేతికొచ్చిన ఖరీఫ్ పంటలన్నీ జలసమాదయ్యాయి. రబీలో పప్పుశనగ సాగుకు దిగిన అన్నదాతల్లో.. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో రబీ సీజన్​లో సాధారణంగా 1.23 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తుండగా, ఇప్పటి వరకు 87 వేల హెక్టార్లలో పలు పంటలు విత్తనాలు వేశారు.

rabi crop at anantapuram
అన్నదాతలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్న రబీ

By

Published : Dec 6, 2020, 10:02 AM IST


అనంతపురం జిల్లాలో రైతులు ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏటా ఖరీఫ్​లో చినుకు కోసం ఎదురు చూసేవారు.. ఈసారి పలు దఫాలు కురిసిన కుండపోత వానలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రబీలో 96 వేల హెక్టార్ల వరకు సాగుచేసే పప్పుశనగను వ్యవసాయశాఖ ఈసారి 69 వేల హెక్టార్లకు తగ్గించింది. గతంతో పోలిస్తే 25 శాతం వరకు పప్పుశనగ సాగు విస్తీర్ణం తగ్గించారు. ప్రస్తుతం ఈ పంట 25 రోజుల దశలో ఉండటంతో రైతులు రబీ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా వర్షాలు పుష్కలంగా కురిసి, అన్నిచోట్లా చెరువులు, కుంటలకు నీరు రావటంతో పలు గ్రామాల్లో రైతులు వరిసాగుకు దిగారు. జిల్లాలో ఇప్పటి వరకు రబీలో 1100 హెక్టార్లలో వరిసాగు జరిగింది. పప్పుశనగ సాగుచేసే భూముల్లో ఈసారి చాలామంది రైతులు మొక్కజొన్నకు మొగ్గుచూపారు. రబీలో 5042 హెక్టార్లలో సాగుచేస్తుండగా, 994 హెక్టార్లలో విత్తనం వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న విస్తీర్ణం ఈసారి పెరగనున్నట్లు వ్యవసాయశాఖ అంచనావేస్తోంది.

నివర్ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 2408 హెక్టార్ల వరకు పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. పంట నష్టంగా మూడు వేల కోట్ల రూపాయలు ఇన్ పుట్ రాయితీ రూపంలో ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వేరుశనగ పంటను కోల్పోయిన రైతులు చాలామంది.. బోర్లకింద మళ్లీ అదే పంటను రబీలో సాగుచేస్తున్నారు. రబీ సీజన్ మొత్తంలో 22 వేల714 హెక్టార్లు సాగవుతుండగా, డిసెంబర్ మొదటి వారానికి 5670 హెక్టార్లలో విత్తనం వేయాల్సి ఉంది. అయితే నష్టపోయిన రైతులు మళ్లీ ఇదే పంటపై మొగ్గుచూపి 6200 హెక్టార్లు సాగుచేయటంతో, ఇప్పటికే పంట సాగులోకి వచ్చినట్లైంది.

ఈసారి రబీ పంటలైనా దక్కితే ఖరీఫ్ నష్టం నుంచి కొంతమేరకైనా, రైతులు కోలుకోగలుగుతారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

ఇవీ చూడండి..

దెబ్బతిన్న రహదారులు.. వాహన చోదకులకు ఇక్కట్లు

ABOUT THE AUTHOR

...view details