ఏటా వర్షాభావంతో నష్టపోయే అనంత రైతులు.. ఈసారి అధిక వర్షాలతో అప్పులపాలయ్యారు. దశాబ్దకాలంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రికార్డుస్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. మూడు విడతలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ పంట కుళ్లిపోయింది. ఈసారి ఖరీఫ్‌లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 6.41 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుచేశారు. దీనిలో ఐదు లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగుచేశారు. జూన్, జూలై, ఆగస్టు వరకు రైతులు వాతావరణ అనుకూలతను బట్టి విత్తనం వేశారు. కొన్నిచోట్ల సకాలంలో వర్షాలు కురవగా.. మరికొన్నిచోట్ల రైతులు విత్తనం వేయటానికి అవకాశం లేకుండా రోజూ జల్లులు పడుతూనే ఉన్న భిన్నమైన పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు.
దీంతో ఏటా ఒక్కసారిగా విత్తనం పడే పరిస్థితి ఈసారి లేకుండా పోయింది. వాతావరణం ఈసారి అన్నదాతను తీవ్రంగా నష్టపరిచింది. అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ వేసిన పంట నష్టం అంచనాలు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేనివిధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టం జరిగిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇన్పుట్ రాయితీ కోసం నివేదికలు సిద్ధం చేశారు. వేరుశనగ పంటకు 7వేల 425 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగినట్లు గణాంకాలు చూపుతున్నారు. ఈ పంట వేసిన రైతులు కేవలం 6వేల 600 మంది నష్టపోయినట్లు ప్రభుత్వానికి నివేదించారు. అన్నిచోట్లా వేరుశనగ రైతులు పలు దశల్లో పంటను నష్టపోయారు.
అయితే అధికారులు మాత్రం పీకటానికి సిద్ధంగా ఉన్న పంటను, కీలక దశలో ఉన్న పంటలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. కుప్పవేసిన పంటను పరిహారం జాబితాలో చూపలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పవేసిన పంట ఎక్కడిక్కడ నల్లగా మారిపోయి, వేరుశనక్కాయలు తడిసి మొలకెత్తగా.. పశుగ్రాసం బూజు పట్టింది. ఇంతటి నష్టం జరిగినా పరిహారం నివేదికలో నమోదు చేయలేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయశాఖ 12 రకాల పంటలకు మాత్రమే భారీ వర్షాలతో నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదించింది. జిల్లాలో ఏడు లక్షల 25 వేల మంది రైతులుండగా, కేవలం 14 వేల 747 మంది రైతులే నష్టపోయారని లెక్కతేల్చింది.