Farmer Protest For Crop Insurance: నష్టపోయిన పంటలకు బీమా పరిహారం కోసం నిరసనకు దిగిన అనంత రైతులపై.. పోలీసులు కేసులు నమోదు చేశారు. వారితో పాటు ఆందోళనలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులపైనా కేసులు పెట్టారు. రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ బీమా పరిహారం ఇవ్వకుండా తిప్పుతున్నారన్న రైతులు.. ఇంకెంత కాలం కార్యాలయాల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. అందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
గతేడాది అన్ని పంటలూ నష్టపోయినా.. కొన్ని మండలాల్లోని రైతులకే ప్రభుత్వం బీమా వర్తింపజేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు రైతులు గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. అన్నదాతల ఆందోళనకు తెలుగుదేశం, ఏపీ రైతుసంఘం మద్దతు పలికాయి. అధిక వర్షాలతో మిరప, వేరుసెనగ, కంది, ఆముదం పంటలు దెబ్బతిని పెట్టుబడి కూడా తిరిగి రాలేదని రైతులు వాపోయారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొందని.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం వల్లే సచివాలయాన్ని ముట్టడించామని చెప్పారు.
ప్రభుత్వం మారి.. కష్టాలు రెట్టింపు.. పరిహారం కోసం రైతుల పడిగాపులు
అయినా అధికారులెవరూ స్పందించకపోవడంతో.. రైతులతో కలిసి రైతు నేతలు, రాజకీయ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని పంటలకు, రైతులందరికీ బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 8న కల్యాణదుర్గంలో జరిగే సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాసేపటి తర్వాత ఉరవకొండ అర్బన్ సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో అక్కడికి వచ్చిన పోలీసులు.. రైతులను బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు.