సాధారణంగా ఓ మధ్య తరగతి ఇంటికి కరెంట్ బిల్లు రూ. 500 లేదా రూ.600 వరకు వస్తుంది. అదే కూలి పనులకు వెళ్లే ఇంటివారికైతే రూ.200 నుండి 300 వరకు వస్తుంది. కానీ అనంతపురం జిల్లాలో ఓ పేద కుటుంబానికి ఏకంగా రూ. లక్షల్లో విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఆ రైతు షాక్కు గురయ్యాడు. హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు.
పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప ఓ సాధారణ కూలీ. ఆయన ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్ ఉన్నాయి..ప్రతినెలా కరెంటు బిల్లు రూ. 200 నుండి 300 వరకు వచ్చేది. కానీ ఈ సారి ఏకంగా రూ. 1,48,371 రావడంతో అవాక్కయ్యాడు. విద్యుత్ శాఖ సిబ్బంది చుట్టూ తిరిగితే రూ. 56,399కు తగ్గించి కట్టాలని చెబుతున్నారని వాపోయాడు. అంతా బిల్లు తాను ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు.
గ్రామంలోని బండయ్య అనే మరో వ్యక్తికి కూడా రూ.78,167 ఒకసారి..మరోసారి రూ.16,251 ఒకసారి వచ్చినట్లు ఆయన తెలిపారు. సాధారణ కూలి పని చేసి జీవించే తమకు ఇంత కరెంట్ బిల్లు వస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. పెద్ద..పెద్ద అంతస్తులు.. కంపెనీలు ఉన్న వారికి కూడా ఇంత బిల్లు రాదని అన్నారు. ఇదేవిధంగా ఆ గ్రామంలో ఐదారు కుటుంబాలకు అధిక కరెంట్ బిల్లులు వచ్చినట్లు తెలిసింది. విద్యుత్ అధికారులు స్పందించి.. మీటర్ బాక్సులలో సమస్యలు ఉంటే పరిష్కరించాలని కోరుతున్నారు.
ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులురెడ్డిని వివరణ కోరగా.. సాంకేతిక సమస్యల వల్ల లేదా సిబ్బంది బిల్లులు ఇచ్చే సమయంలో రీడింగ్ తప్పుగా నమోదు చేసి ఉంటారని తెలిపారు. మీటర్లో సమస్య ఉంటే సరిచేస్తామన్నారు. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూస్తామన్నారు. అవకాశం ఉంటే వారి బిల్లులో కొంతవరకు తగ్గేంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ఆ ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్లు..ఎందుకో తెలిస్తే షాక్ ఇదీ చదవండి:Electricity Bill: బిల్లు చూడగానే..కొట్టింది షాక్