అనంతపురం జిల్లా కదిరి కదిరి నియోజకవర్గంలో పది రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి... చేతికందే పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జులైకి ముందే సాగుచేసిన వేరుశనగ పంట కోత దశకు వచ్చింది. కొందరు రైతులు పంటను కాపాడుకునే క్రమంలో వేరుశనగ కోతలు మొదలు పెట్టేశారు. మరుసటి రోజు నుంచే వర్షం ప్రారంభం కావడం వల్ల వేరుశెనగను పొలంలోనే వదిలేశారు. ఎడతెరిపి లేని వర్షం దెబ్బకు వేరుశనగలు మొలకెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కదిరి ప్రాంతంలో సాగు చేసిన సజ్జ పంట సైతం కోతకు వచ్చింది. ఆగకుండా కురుస్తున్న వర్షం వల్ల పొలంలోనే రంగు మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరపడి కోతకు సిద్ధమైతే గింజ కూడా చేతికందదని వాపోతున్నారు. సజ్జను క్వింటాలు 3500 రూపాయల చొప్పున విక్రయించేందుకు వ్యాపారుల నుంచి అడ్వాన్స్ తీసుకున్నామని, వర్షం కారణంగా రంగు మారడంతో వ్యాపారులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
వంక పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరి పంటను సాగు చేశారు. కొండ ప్రాంతాల నుంచి వర్షపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున నీటి ఉధృతికి వరి నారు కోతకు గురై పూర్తిగా పాడైంది. ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ అధికారుల చేత పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.