వైకాపా నాయకులు తనను నిత్యం వేధిస్తున్నారని అనంతపురం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి వాసి... కుళ్లాయప్ప ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ఐదు ఎకరాల పొలంలో వైకాపా నాయకులు దౌర్జన్యంగా దారి ఏర్పాటు చేసి నిత్యం దాడులు చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.
వైకాపా నాయకులు వారి తోటలోకి దారి ఉన్నా... తను సాగుచేసుకుంటున్న భూమిలో దారి ఏర్పాటు చేశారని వాపోయాడు. అర ఎకరం మేర పంటను కోల్పోయానని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నాడు. వైకాపా నాయకులు తనను.. తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని కుళ్లాయప్ప కోరాడు.