అనంతపురం కలెక్టరేట్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. భార్య, తల్లి ఎల్లమ్మ తో కలిసి కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు... పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. మడకశిర మండలం కోడిగానిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులుకు గ్రామంలో 196/3 సర్వే నంబర్లోని 28 సెంట్ల భూమి ఉంది. ఈ క్రమంలో మడకశిర ఎమ్మార్వో, వీఆర్వోలు రామాంజనేయులును బెదిరించి ఆ భూమిని అతని పెదనాన్నకు రాసి ఇచ్చారని బాధితులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు పట్టించుకోవడం లేదని రామాంజనేయులు తల్లి ఎల్లమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పదేళ్ల క్రితమే ఆ భూమిలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి ఖాళీ చేయాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.