అనంతపురంలోని నాయక్ నగర్‌లో హన్మంతరెడ్డి, లక్ష్మీనారాయణమ్మ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్మంతరెడ్డి ఆటో నడుపుతూ పిల్లలను చదవించేవారు. 2006లో కురిసిన భారీ వర్షానికి.. మురుగు ప్రవాహంలో కొట్టుకొచ్చిన కుక్క పిల్ల హన్మంత రెడ్డి దంపతుల కంట పడింది. వెంటనే దాన్ని మురుగులో నుంచి తీసి రక్షించారు. దానికి 'బ్లాకీ' అని నామకరణం చేశారు. అప్పటి నుంచి పిల్లలతో సమానంగా దాన్ని సాకుతూ వచ్చారు. ఆ కుటుంబం కొత్తగా నిర్మించుకున్న ఇంటికి సైతం శునకం పేరుతో బ్లాకీ స్వీట్ హోంగా ఫలకం ఏర్పాటు చేశారు.
క్యాన్సర్తో మరణించిన శునకం
పదేళ్లపాటు హన్మంతరెడ్డి కుటుంబంతో ఉన్న శునకం బ్లాకీకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ గడ్డను తొలగించేందుకు ఖరీదైన శస్త్రచికిత్స కూడా చేయించారు. ఆపరేషన్ అనంతరం ఏడాదిన్నరపాటు బ్లాకీకి సపర్యలు చేశారు. పరిస్థితి విషమించడంతో శునకం 2016లో చనిపోయింది. వారితో పదేళ్లపాటు జీవించిన శునకం మృతి చెందాక దానిపై ఉన్న ప్రేమతో వారి స్వగ్రామం బి.పప్పూరులో సమాధి కూడా నిర్మించారు. ఆ బుజ్జి కుక్క పిల్లను చేరదీసిన తర్వాత..వారి కుటుంబ దశ తిరిగిందనేది వారి విశ్వాసం. బ్లాకీ మృతి అనంతరం దాని ఫొటోకు నిత్యం పూజలు చేస్తున్నారు. ఏటా బ్లాకీ జయంతి, వర్ధంతిని కూడా నిర్వహిస్తున్నారు.
జంతు ప్రేమికులకు ఆదర్శంగా