అనంతపురంలో ఓ యువతి హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చింది. తాను జాయింట్ కలెక్టర్‌నని, కొత్తగా ఛార్జ్ తీసుకున్నానని చెప్పగానే..... అక్కడున్న సిబ్బందిలో వణుకు పుట్టింది. సడన్ విజిట్ కు వచ్చాను. త్వరగా రికార్డులు తీయండంటూ సీట్లో కూర్చోవడంతో... సిబ్బందికి చెమటలు పట్టాయి. శెట్టూరు మండలం తిప్పనపల్లి, చింతర్లపల్లి సచివాలయాలు తనిఖీచేసి.. అక్కడున్న సిబ్బందికి వార్నింగ్ ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమె తీరుపై అనుమానం వచ్చిన... సిబ్బంది వెంటనే తహసీల్దార్, ఎస్ఐకి సమాచారం అందించారు. వారు వచ్చి చూస్తే కానీ తెలియదు..ఆమె నకిలీ ఐఏఎస్ అని.
జాయింట్ కలెక్టర్ అంటూ..హల్‌చల్ చేసిన యువతి.. చివరికి... - అనంతపురం జిల్లాలో జాయింట్ కలెక్టర్ అంటూ హల్‌చల్ యువతి
కొత్తగా ఛార్జ్ తీసుకున్న జాయింట్ కలెక్టర్ అంటూ..అనంతపురం జిల్లాలో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఐడీ కార్డులు చూపి ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేయాలంటూ హడావుడి చేసింది. కార్యాలయాల్లోని అధికారులను హెచ్చరిస్తూ ముచ్చెమటలు పట్టించింది. తీరా వచ్చిన యువతి... జాయింట్ కలెక్టర్ కాదని.. డిగ్రీ చదివే ఓ యువతి అని తెలియగానే ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది.
వెంటనే నకిలీ ఐఏఎస్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని కలెక్టరేట్ కు తరలించారు. సదరు యువతి బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన సింధూరిగా గుర్తించారు. డిగ్రీ చదువుతున్నట్టు తెలుస్తోంది. యువతితో పాటు.. ఓ డ్రైవర్ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యువతి నకిలీ ఐఏఎస్ అవతారం ఎందుకు వేసిందో..... ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'స్టార్టప్ హబ్‌గా విశాఖను మారుస్తాం'.. దావోస్ సదస్సులో సీఎం జగన్