అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సర్పంచ్ సురేంద్ర, అతని భార్య పార్వతి తమకు రెండు పెద్ద పాత్రల్లో బంగారం దొరికిందని.. తన కుమారుడి పేరుపై 11 కేజీల బంగారాన్ని దానం చేయాలంటూ ఓ కట్టుకథ అల్లారు. ఈ దొరికిన బంగారాన్ని మామూలు బంగారంగా మార్చడానికి డబ్బు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు, తెలిసిన వ్యక్తులతో నమ్మబలికారు. ఇలా దాదాపు 32 కుటుంబాల దగ్గరి నుంచి.. ఒక్కో కుటుంబం వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. మొత్తంగా రూ. కోటి 50 లక్షలు తమ వద్ద వసూలు చేశారంటూ బాధితులు వాపోతున్నారు.
ఒక రోజు కర్నూలు నుంచి బంగారం, డబ్బులు తీసుకువస్తున్నామని.. 15 మందిని ఒక ఇంట్లో సమావేశపరిచి మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని ఇచ్చారు. వారు నిద్రలోకి జారుకోగానే నకిలీ బంగారం, దొంగ నోట్ల కట్టలను అక్కడ ఉంచి ఉడాయించారు. తర్వాత మెలకువ వచ్చి నకిలీ బంగారం, డబ్బును గమనించిన బాధితులు నివ్వెరపోయారు.
దీనిపై దంపతులను ప్రశ్నించగా.. తాము అంతా సక్రమంగానే ఇచ్చామని, తమదేమీ తప్పులేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పైగా బాధితులను బెదిరించడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా సరిగా స్పందించకపోవడంతో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కలిశారు. తమ ఆస్తులు తాకట్టుపెట్టి డబ్బుఇచ్చామని.. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో మెుత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపిన బాధితులు.. వారిని అరెస్ట్ చేసి డబ్బు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.