Extreme Drought Conditions in Anantapur District: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3.70 లక్షల హెక్టార్లు ఉండగా, ఈసారి కేవలం 2.50 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగుచేశారు. ఖరీఫ్ ఆరంభంలో వేసిన పంటలు పూర్తిగా నష్టపోగా.. ఆగస్టు తొలి వారంలో వేసిన పంటలు సెప్టెంబర్ మెుదటివారంలో కురిసిన వర్షానికి కొంతమేర పచ్చగా మారినా.. అప్పటికే వేరుశనగ వేర్లు భూమిలోకి దిగే సమయం పూర్తికావటంతో దిగుబడి 60 శాతం మేర తగ్గనుందని అధికారులు అంచనా వేశారు.
వేరుసెనగ, ఆముదం పంటలు బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అన్నదాతలు వాపోయారు. క్షేత్రస్థాయిలో ఆముదం పంటను పరిశీలించిన వ్యవసాయశాఖ అధికారులు దిగుబడి తగ్గుతుందని ప్రభుత్వానికి నివేదించారు. కంది నెల రోజుల పంట కావటంతో కొంతమేర నష్టపోయినా, మళ్లీ పచ్చగా మారిందని, అయితే ప్రస్తుతం నాలుగు రోజుల్లో వర్షం రాకపోతే ఈ పంట కూడా పూర్తిగా ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Farmer Crop Loss inn Anantapuram: అనంతలో వర్షాభావ పరిస్థితులు.. సాగు నీరందక ఎండిన పంటలు
అనంతపురం జిల్లాలో 29 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 35 శాతం వర్షపాత లోటు కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో దాదాపు 50 రోజులపాటు చినుకు జాడ లేకపోవటంతో 1.20 లక్షల హెక్టార్లలో రైతులు ఏ పంట వేయలేక భూమిని బీడు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు సాగు చేసిన పంటలకు దిగుబడులు గణనీయంగా తగ్గి నష్టం రానుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వర్షం లేక తీవ్రంగా పంట నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.