యూహెచ్‌సీల్లో గడువు తీరుతున్న మందులు Expired Medicine In Anantapur Urban Health Center: ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రజారోగ్యం కోసం కొనుగోలు చేసిన మందులు నిరుపయోగంగా మారుతున్నాయి. అనంతపురంలోని ఆరోగ్య కేంద్రాల్లో.. కాలం తీరిన మందులు గుట్టగుట్టలుగా దర్శనం ఇస్తున్నాయి. రెండు, మూడు నెలల్లో కాలం తీరిపోయే మందులు సరఫరా చేయటం వల్ల సిరప్‌లు, యాంటీబయోటిక్ ఔషదాలు గడువు తేది ముగిసి నిరుపయోగంగా మారాయి.
ప్రభుత్వం ఏటా పేదల ఆరోగ్యం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీనిలో సింహ భాగం రోగులకు అవసరమయ్యే మందులు కోసం వినియోగిస్తుంది. ఏ ప్రాంతంలో ఎలాంటి వ్యాధులున్నాయి.. సీజనల్‌గా వచ్చే వ్యాదులేంటి.. అనే దానిపై వైద్యారోగ్య శాఖ వద్ద సమాచారం ఉంటుంది. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాలకు అవసరమైన మందుల్ని సరఫరా చేస్తుంది. కానీ ప్రస్తుతం ఎలాంటి కసరత్తు చేయకుండానే అవసరం ఉన్నవి.. లేనివి.. అని చూడకుండా మందుల్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 44పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటిలో అనంతపురం జిల్లాలో 25 ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 19 యూహెచ్‌సీలు ఉన్నాయి. అనంతపురం నగరంలోని ఆదిమూర్తినగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం పరిశీలించిన ఈటీవీ భారత్ బృందానికి.. అక్కడ పెద్దసంఖ్యలో యాంటీబయోటెక్ మందులు, ఇతర ఔషదాలు గుట్టలుగా ఓ మూలకు పడి నిరుపయోగంగా కనిపించాయి.
కొద్దిరోజుల క్రితం అంగన్వాడీ వర్కర్ల ద్వారా కొన్ని సిరప్‌లను రోగులకు అందచేసినా ఇంకా కొన్ని మిగిలిపోయే ఉన్నాయి. వీటి గడువు మరో పది రోజుల్లో ముగుస్తుండటం.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారులు మాత్రం.. తమ వద్ద నుంచి పంపిణీ చేసే మందులు ఏడాదికి తక్కువ కాకుండా కాలపరిమితి ఉండేలా జాగ్రత్త తీసుకుంటామని చెబుతున్నారు. మందులు సరఫరా జరిగినపుడు కొన్నిచోట్ల కాలం తీరిపోతున్న విషయం వాస్తవమేనని.. వాటిని గుర్తించి నివారిస్తామని వైద్యాధికారులు అంటున్నారు.
"మనకు వచ్చే ప్రతి దానికి రెండు సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. ఇక్కడ ఏవైనా కాలపరిమితి చెల్లిపోతే జిల్లా స్టోర్స్‌కి తిరిగి ఇస్తాము. పంపిణీలో అలస్యం కారణంగా కాలపరిమితి చెల్లిపోయి ఉండొచ్చు. స్లమ్ ఏరియాలోని ప్రజలకోసం పంపిణీ చేసేవి కాబట్టి.. రోగులు అందుబాటులో లేకపోయిన కాలపరిమితి చెల్లిపోయి ఉంటుంది." - వెంకటరమణ, ఫార్మసీ సూపర్ వైజర్, సెంట్రల్ డ్రగ్ స్టోర్
"ప్రస్తుతం ఏడుగురు సిబ్బందితో యూహెచ్సీని నిర్వహిస్తున్నాము. 170 రకాలైన మందులను అక్కడ ఉంచాము. వైద్య పరీక్షలకోసం ల్యాబ్ టెక్నిషియన్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. కాలపరిమితి చెల్లిపోయే వాటిని గుర్తించి.. వాటి కాలం తీరేలోపు పంపిణీ చేస్తారు. ఆలోపు కూడా వాటి కాలం చెల్లిపోతే పక్కన పెడ్తారు. రాబోయే రోజుల్లో మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా జరగే అవకాశం ఉండదు." -డా. యుగంధర్, ఇమ్యూనైజేషన్ జిల్లా అధికారి
రోగులకు అవసరమైన మందుల్ని సరిపడా అందుబాటులో ఉంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలా గడువు తీరుతున్న ఔషదాలపై వైద్యశాఖ అధికారులు దృష్టి సారించాలని అంటున్నారు.