అనంతపురం నగర మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. పలువురు ఆశావహులు పోటీ పడటమే అందుకు కారణం. అనంతపురానికి 2005లో నగరపాలక హోదా కల్పించారు. 16 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే నగరపాలక ఎన్నికలు జరిగాయి. తొలి మేయర్‌గా రాగే పరశురాం, రెండో మేయర్‌గా స్వరూప పదవి అలంకరించారు. తాజాగా మూడో దఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఈ పదవిపై ఆసక్తికర రాజకీయ చర్చ నడుస్తోంది.
పరోక్ష పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకుంటారు. అనంతలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 మంది కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకుంటారు. అందులో ఒకరిని మేయర్‌గా ఎన్నుకుంటారు. వైకాపా, తెదేపా మధ్య పోటీ కొనసాగుతోంది. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి, అది దక్కని నాయకులు మేయర్ పదవిపై దృష్టి పెట్టారు. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే ఇరు పార్టీల ఆశావహులు మంతనాలు సాగిస్తున్నారు.
అధికార పార్టీలో తీవ్రపోటీ
నగర, పురపాలికల్లో పాగా వేయాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వైకాపాకు చెందిన మాజీ కార్పొరేటర్ కొగటం విజయభాస్కరరెడ్డి మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఒకసారి, ఆయన సతీమణి కొగటం శ్రీదేవి ఒకసారి కార్పొరేటరుగా ఎన్నికయ్యారు. తాజాగా 4వ డివిజన్ నుంచి వారిద్దరూ నామపత్రాలు సమర్పించారు. భాస్కర్‌రెడ్డి పోటీలో నిలిచే అవకాశముంది. తెదేపా తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, వైకాపా తరఫున ఎమ్మెల్యే టికెట్టు ఆశించిన మహాలక్ష్మి శ్రీనివాస్ ఈసారి కార్పొరేటర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, వైకాపా తరఫున ఎమ్మెల్యే టిక్కెట్టుకు ప్రయత్నించిన చవ్వారాజశేఖర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. మాజీ మేయర్ రాగే పరశురాం తన సతీమణి నాగమణిని ఎన్నికల బరిలో నిలిపారు. ఆయన కూడా మేయర్ పీఠం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి సన్నిహితంగా ఉంటున్న బాలాంజనేయులు కూడా ఆశావహుల జాబితా ఉన్నారు. ఆయన గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. రెండోసారి నామినేషన్ వేశారు.