గుప్త నిధులపై ఆశతో గ్రామంలోని ఓ ఇంట్లో తవ్వకాలు చేస్తున్న 8 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి సమీపంలోని మూర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ ఇంటి యజమానురాలు బంధువులు ఊరికి వెళ్తూ.. పక్కింటి వారికి తాళం ఇచ్చి వెళ్లింది. వ్యక్తిగత పనిమీద గ్రామానికి వచ్చామని ఆ ఇంటి యజమానికి పరిచయం ఉన్న మరో మహిళ.. పక్కింటి వారి నుంచి తాళం తీసుకుంది.
అనంతరం తన సహచరులతో కలిసి ముందస్తు ప్రణాళికతో తవ్వకాలు అవసరమైన పరికరాలను ఇంట్లోకి చేర్చారు. రాత్రి సమయంలో తవ్వకాలు ప్రారంభించారు. రాత్రి ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో తవ్వకాలు చేస్తున్న ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.