ఇటీవల అనంతపురం జిల్లాలో యువతి హత్యకు కారకులైన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని.. మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మవరం మండలం బడన్నపల్లిలో జిల్లాలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దళితులపై దాడులు, హత్యలను ప్రేరేపించేలా ప్రభుత్వం పాలిస్తోందని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం ఈ ఘటనలో స్పష్టంగా కనబడుతోందన్నారు.
రాష్ట్రంలో దళితులపై దమనకాండ జరుగుతోందని హర్షకుమార్ విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వారికి తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందన్నారు. ఈ కేసులో అలసత్వం వహించిన పోలీసులను సస్పెండ్ చేసి.. నిందితులను ఎన్కౌంటర్ చేయాలన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. కోటి పరిహారంతో పాటు చట్టపరంగా అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.