Nara Lokesh Yuva Galam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 61వ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో సాగింది. బుధవారం అనంతపురం గ్రామీణం పరిధిలోని ఎమ్వైఆర్ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు వరకు సాగింది. ఉరవకొండ సరిహద్దు ప్రాంతంలో.. ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు.. లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.
కూడేరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన లోకేశ్.. జాబ్ క్యాలెండర్ పేరిట యువత, నిరుద్యోగుల్ని సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చింది లేదన్నారు. ఏటా 6,500 పోలీసు కొలువులు, మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పక్కాగా అమలు చేస్తామన్నారు. గుంటూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో మూసేసిన స్టడీ సర్కిళ్లను తిరిగి ప్రారంభిస్తామన్నారు.
"సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ పేరిట యువత, నిరుద్యోగుల్ని మోసం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పక్కాగా అమలు చేస్తాం." - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి