ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Help: 'రోజుకో రూపాయి ఇవ్వండి..పేదల ఆకలి తీరుస్తాం..' - పేదలి ఆకలి తీరుస్తున్న నిత్య సురభి ఛారిటబుల్‌ ట్రస్టు

సోనూసూద్‌లా వేల మందికి సాయం చేయలేకపోవచ్చు. కనీసం చుట్టూ ఉన్న పేదవాళ్లలో కొంతమందినైనా ఆదుకోవాలన్నది ఆ దంపతుల తపన. కోట్ల రూపాయల ఆస్తి లేకపోయినా అంతకన్నా విలువైన ఆలోచనతో కరోనా సంక్షోభంలో పేదల ఆకలి తీర్చుతున్నారు. రోజుకు ఒక్క రూపాయి సాయం చేయండని బంధువులు, స్నేహితులను సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.

Engineer couple help to poor in Anantapur
పేదలకు అండగా నిలుస్తున్న నిత్యసురభి ఛారిటబుల్‌ ట్రస్టు

By

Published : May 28, 2021, 8:07 AM IST


లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, పని దొరికినా ప్రాణభయంతో పనికి వెళ్లలేక ఇబ్బందిపడుతున్న పేదవాళ్లకు.. నిత్య సురభి ఛారిటబుల్‌ ట్రస్టు అండగా నిలుస్తోంది. అనంతపురం నాయక్‌నగర్‌కు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ దంపతులు నిర్మల, మురళీకృష్ణ గత ఐదేళ్లుగా కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలుస్తున్నారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో పూటగడవని వాళ్లకు ఆకలి కష్టాలు తొలగిస్తున్నారు.

పేదలకు సాయం చేస్తున్న నిత్యసురభి ఛారిటబుల్ ట్రస్ట్

నిర్మల ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం... నిత్యసురభి ట్రస్టు ఏర్పాటు చేశారు. ఆమె ఆలోచనకు భర్త మురళీకృష్ణ మద్దతు లభించింది. సేవ చేయాలంటే కోట్లకొద్దీ డబ్బులు ఉండక్కర్లేదని... నమ్మకం, మంచిఆలోచన ఉంటే చాలని ఆమె నిరూపించారు. రోజుకు రూపాయి దాచి తనకు ఇవ్వండి... తమచుట్టూ ఉన్న అనాథ విద్యార్థులను ఆదుకుంటాను, పేదల ఆకలి తీరుస్తాను అని కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలిపారు. అప్పటి నుంచీ.. సేకరించిన డబ్బుకు, తమ సంపాదన కలగలిపి... సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకూ 18 మంది విద్యార్థుల చదువుకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు. నిరుపేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు విందుకు సరిపడా సరుకులు అందిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద మహిళలను ఆదుకోవటమే లక్ష్యంగా నిత్యసురభి ట్రస్టు సేవలందిస్తోంది. ప్రతి పండుగకూ కనీసం 30 కుటుంబాలకు అన్ని రకాల నిత్యావసర సరుకులను వితరణ చేస్తున్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించటమేగాకుండా సీమంతం నిర్వహిస్తున్నారు. మద్యానికి బానిసైన ఇంటి యజమానులకు కౌన్సిలింగ్‌ ఇప్పిస్తూ... వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు.

కరోనా కష్టకాలంలో ఉపాధి లేక తల్లడిల్లిపోయామని... సాయం కావాలంటూ నిర్మలను అడగ్గానే తమను ఆదుకున్నారని నిరుపేద మహిళలు తెలిపారు.పేదలకు అండగా నిలవడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా లేదంటున్న నిర్మల... తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు, పిల్లలు పట్టించుకోని వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'సహాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details