Negligence on power supply system maintenance: దశాబ్దాల క్రితం వేసిన కరెంటు తీగలు.. మరమ్మతులు చేపట్టని విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వెరసి నలుగురు కూలీలు కన్నుమూయగా మరో ముగ్గురు చావుబతుకుల మధ్య ఉన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరులో.. పనులు ముగించుకుని ట్రాక్టర్ ఎక్కిన కూలీలపై విద్యుత్ వైరు తెగిపడింది. చనిపోయిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబీకులు కావడంతో బంధువులు రోదిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ఈ తరహా ప్రమాదం రెండోది. గతంలో.. సత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు చనిపోతే ఉడతపై నెపం నెట్టారు. ఆ ఘటన మరువక మందే మళ్లీ అలాంటి ప్రమాదమే జరిగింది. విద్యుత్ వైరు తెగి ట్రాక్టర్‌పై పడితే..ఇన్సులేటర్ దగ్గర మంటలు వచ్చి ప్రమాదం జరిగిందంటున్నారు. వేలకోట్లతో... స్మార్ట్ మీటర్లు బిగించడం,.. అస్మదీయులకు సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఇప్పించుకోవడంలో ఉన్న శ్రద్ధ విద్యుత్ పంపిణీ వ్యవస్థల.. బలోపేతంపై ప్రభుత్వం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రమాదాలు జరిగాక పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం.. వార్షిక నిర్వహణ, విద్యుత్ పరికరాల నాణ్యతపై నిశిత పరిశీలన జరగడం లేదు. ప్రమాదాల నియంత్రణకు సబ్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు సరిగా పనిచేయకనే ప్రజల ప్రాణాలు పోతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. విద్యుత్తు తీగలు తెగిపడిన వెంటనే ఎర్తింగ్ కావాలి. క్షణాల్లో ఆ లైన్లలో సరఫరా నిలిచిపోవాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు.