Old Man Got High electricity bill: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విద్యుత్ వినియోగదారుడికి ఊహించని షాక్ ఎదురైంది. పెంకుటిల్లు ఇంటికి 9వేల 859 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ డోలక్ వాయిద్యకారుడు కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గుత్తి పట్టణంలో షఫీ(60) అనే వృద్ధుడు డోలక్ వాయిద్యకారుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఉండేది పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లులో మూడు విద్యుత్ బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది.
అయితే ఆ ఇంటికి నెలకు సాధారణంగా రూ.150 నుంచి రూ.250 వరకు కరెంట్ బిల్లు వస్తుండేది. అయితే గత రెండు నెలల నుంచి కరెంట్ బిల్లు అధికంగా వస్తుండడంతో ఆ బిల్లు చెల్లించేందుకు అతడు నానా ఇబ్బందులు పడుతుండేవాడు. కాగా గత నెల రూ. 900 కరెంట్ బిల్లు రావడంతో పొరపాటుగా ఏమన్నా వచ్చిందేమోనని విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాడు. అయితే వారు కచ్చితంగా కట్టాల్సిందేనని తెలపడంతో కార్మికుడు 900 రూపాయల కరెంటు బిల్లు చెల్లించాడు.
అయితే అతడికి ఊహించని మరో షాక్ ఎదురైంది. ఈ నెలకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభైతొమ్మిది రూపాయల కరెంటు బిల్లు రావటంతో షఫీ కంగుతున్నాడు. ఒకపూట ఇల్లు గడవటానికే కష్టంగా ఉంటే ఇంత బిల్లు ఎలా చెల్లించాలని బాధపడుతూనే విద్యుత్‌శాఖ అధికారులను సంప్రదించాడు. విద్యుత్ శాఖ అధికారులు మీటర్ జంప్ అయి ఉంటుందని చెప్పారు. మీటరును అనంతపూర్‌కు పంపించి దాన్ని సరి చేయాలని వాటికి వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చవుతుందని వారు చెప్పారు.