YSRCP Vs TDP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా శ్రేణులు పోటాపోటీగా.. ఆందోళనలు చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువును మంత్రి ఉషశ్రీ అనుచరులు పూడ్చివేస్తున్నారని.. 40 రోజులుగా తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. చెరువు పూడ్చివేతను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ.. నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మండిపడ్డ వైకాపా నేతలు..తెదేపా నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ ఆందోళన చేపట్టారు.
దీనికి ప్రతిగా తెదేపా శ్రేణులు వైకాపా దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. తెదేపా శ్రేణులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. వైకాపా నేతలపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది.