బయోమైనింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసం - అనంతపురంలో వైసీపీ అనుయాయులకు కాసుల వర్షం Dumping Yard Scam in Anantapur: దేశ వ్యాప్తంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానం వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. బయో మైనింగ్ (Biomining) కోసం టన్నుకు 550 రూపాయలు నగరపాలక సంస్థలకు చెల్లిస్తోంది. దీనికంటే అదనంగా గుత్తేదారులకు చెల్లించే పరిస్థితి తలెత్తితే, ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులే అనంతపురంలో అధికారపార్టీలోని వారికి కాసులు కురిపిస్తున్నాయనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా 130 రూపాయలు గుత్తేదారుకు చెల్లిస్తున్నారు. అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ కార్పొరేటర్లే నిలదీయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బయో మైనింగ్ పూర్తి కాకుండానే పది కోట్లకు పైగా బిల్లులు:ఇక్కడ కనిపిస్తున్న ఈ చెత్తంతా అనంతపురం నగరం నుంచి 20 ఏళ్లుగా పోగు చేసింది. ఈ చెత్త బరువును లెక్కించే శాస్త్రీయ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. కాకిలెక్కలతో 3.33 లక్షల టన్నులు ఉందని అంచనా వేశారు. ఈ వృథాను వేరు చేసే పనిని బయో మైనింగ్ అనుభవం లేని హైదరాబాద్‌కు చెందిన ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. 2021 డిసెంబర్‌లో పని ప్రారంభించిన గుత్తేదారు.. ఒక చిన్నపాటి యంత్రంతో పనులు చేశారు. బయో మైనింగ్ పూర్తి కాకుండానే గుత్తేదారుకు పది కోట్లకు పైగా బిల్లులు చెల్లించారు.
Garbage Dumping Yard in Center of the Ongole: నగరం నడిబొడ్డున డంపింగ్ యార్డు.. శుక్రవారంలోపు తొలగించాలని వ్యాపారుల హెచ్చరిక!
గుత్తేదారుడికి మేలు చేసేలా: దేశంలోని పలు రాష్ట్రాల్లో చెత్త శుభ్రం చేయటానికి పలు సంస్థలు.. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతో ఒప్పందాలు చేసుకుని పనులు చేస్తున్నాయి. స్థానిక సంస్థలు ఒక్క రూపాయి కూడా చెల్లించుకుండానే ఈ సంస్థలు.. బయో మైనింగ్ ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లు గుత్తేదారులకు పనులు అప్పగించి, బయోమైనింగ్ ద్వారా లభించిన ఎరువు, ప్లాస్లిక్, మెటల్ వృథాను కోట్ల రూపాయలకు విక్రయించి నగర అభివృద్ధికి వెచ్చిస్తున్నాయి. కానీ అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు మాత్రం గుత్తేదారుడికి మేలు చేసేలా అక్రమాలకు తెరలేపారు. అంతటితో ఆగకుండా సేంద్రియ ఎరువు, మెటల్, ప్లాస్టిక్‌ను సైతం గుత్తేదారే సొమ్ము చేసుకునేలా పచ్చ జెండా ఊపేశారని విమర్శలు వస్తున్నాయి.
గుత్తి రోడ్డులోని డంపింగ్ యార్డు పరిసరాల్లో పలు కాలనీలు వెలిశాయి. చెత్త నుంచి వచ్చే దుర్గంధంతో ఇక్కడి ప్రజలు శ్వాసకోస, కంటి సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డును దూర ప్రాంతానికి తరలిస్తామని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనంత వెంకట రామిరెడ్డి హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కాలేదని విపక్ష నేతలు మండిపడుతున్నారు.
Pollution in Godavari River: గోదారమ్మ ఒడిలోకి కాలుష్య వ్యర్థాలు.. పట్టించుకునేవారే కరువాయే..!