Drinking Water Problem in Anantapur District: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామాల్లో తాగునీటి సమస్య పెచ్చుమీరుతోంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పంపింగ్ తగ్గిపోవటంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉరవకొండలో తాగునీటి కోసం స్థానికులు రోడ్లపైకి వస్తున్నారు.
పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి.. రోజుకు 36 లక్షల లీటర్ల తాగునీటిని పంపింగ్ చేయాల్సి ఉండగా.. 15 లక్షల లీటర్లనే అధికారులు పంప్ చేస్తున్నారు. దీని కారణంగా నీటి సమస్య తలెత్తి.. అనేక కాలనీల్లో 10 రోజులకోసారి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. విడపనకల్లు బీసీ కాలనీకి ఆరు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవటంతో.. మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే మండలంలోని చీకలగుర్కి ఎస్సీ కాలనీకి.. 40 రోజులకోసారి రంగుమారిన నీటిని.. అధికారులు విడుదల చేస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో.. రోజూ రెెండు వందల రూపాయలు నీటి కోసం వెచ్చించాల్సి వస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో వేసవి సమీస్తున్న సమయంలో.. నీటి సరఫరాకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేవారని ప్రజలు అంటున్నారు.