తాగునీరు ప్రజలు తాగాలంటే భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తాగునీటి పైపులకు తుప్పుపట్టండంతో..ఏం అవుతుందోనన్ని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 1,029 గ్రామ పంచాయతీలు, రెండు నగర పంచాయతీల్లో గ్రామీణ నీటి పథకాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3,312 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 52 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేశారు. సత్యసాయి, శ్రీరామిరెడ్డి, జేసీ నాగిరెడ్డి పథకాల ద్వారా సరఫరా చేస్తున్నారు. పథకాల వద్ద నీటిని శుద్ధి చేస్తున్నా.. మార్గమధ్యలో పైపుల లీకేజీలు, మురుగు కాలువల వెంబడి పైపులైన్ల ఏర్పాటుతో కలుషితమవుతున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తుప్ఫు ముప్పు
పలు పట్టణాలు, గ్రామాల్లోని తాగునీటి పైపులు తుప్పు పట్టాయి. తుప్పు పట్టిన పైపుల నుంచి సీసం తాగునీటిలో కలిసే అవకాశం ఉంది. సీసం కలిసిన నీటిని తాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కోసారి క్యాన్సర్‌కు దారి తీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కాచి చల్లార్చిన నీటినే తాగండి
కలుషిత నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. తుప్పు పట్టిన పైపుల కారణంగా నీటిలో సీసం చేరుతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రజలు ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ఉత్తమం.
-అరాఫత్, వైద్యులు, సర్వజనాసుపత్రి
ఏం చేయాలి
ప్రైవేటు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్వాహకులు తరచూ పరీక్షలు చేయించాలి. నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసిన తర్వాత అవసరమైన ఖనిజాలను కలపాలి. భారత నాణ్యత ప్రమాణాల నిర్ధరణ సంస్థ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎలాంటి రసాయనాలను కలపకూడదు. ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పరీక్షించాలి. నెలకోసారి అధికారులు నీటి పరీక్షలు చేసి ధ్రువపత్రాలు జారీ చేయాలి. ప్యాకింగ్ ఉన్నచోట ఐఎస్‌ఐ ముద్ర తప్పనిసరి.
ఏం చేస్తున్నారు
జిల్లాలో ప్రైవేటు నీటి శుద్ధి ప్లాంట్లను పర్యవేక్షించడానికి అధికారులెవరూ లేరు. కనీసం ఎన్ని ప్లాంట్లు ఉన్నాయో లెక్కలు చెప్పే వారే కరవయ్యారు. దీంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. పలు ప్లాంట్లలో ఏళ్లుగా నీటి పరీక్షలు చేయించడం లేదు. తగినంత మోతాదులో ఖనిజాలను కలపడం లేదు. ప్రయోగశాలలు లేవు.