తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ఎలాంటి నష్టం జరగకుండా విధులు నిర్వహించారంటూ డీఎస్పీ వీఎన్కే చైతన్య, ఎస్సై ప్రదీప్ కుమార్ ను అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు ప్రశంసించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎస్పీ పర్యటించారు. ఈ నెల 24న తెదేపా, వైకాపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు ఎస్సీ, ఎస్టీ హత్యాయత్నం కేసులు నమోదు చేశామని తెలిపారు.
శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరిని ఒకరు విమర్శించుకునేలా పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. తాడిపత్రిలో ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు బందోబస్తుతో పాటూ 144 సెక్షన్ని కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాల ద్వారా విచారణ జరుగుతోందని త్వరలోనే ఘర్షణకు సంబందించిన అరెస్టులు చేపడతామని చెప్పారు. ఆయనతో పాటు డీఎస్సీ చైతన్య, సీఐ తేజమూర్తి ఉన్నారు.