అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల 60 వేల హెక్టార్లలో వేరుశనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆ మేరకు ప్రభుత్వం 3.34 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఏటా వేరుశనగ విత్తనం గుత్తేదారుల నుంచి సేకరించి రైతులకు రాయితీపై పంపిణీ చేసే ప్రక్రియ నిర్వహించేవారు. ఈసారి లక్ష క్వింటాళ్ల వేరుశనగ రైతుల నుంచే సేకరించి, ఎక్కడికక్కడ గ్రామాల్లో అవసరమైన రైతులకు పంపిణీ చేయాలని ప్రణాళిక చేశారు. అయితే లక్ష్యం మేరకు సేకరణ చేయలేక పోవటంతో, సింహ భాగం గుత్తేదారులు సరఫరా చేసిన విత్తనమే పంపిణీ చేస్తున్నారు. ఏటా వేరుశనగ విత్తనం మండల కేంద్రంలో మాత్రమే పంపిణీ చేసేవారు. ఈ విధానంలో రైతులు చాలా ఇబ్బంది పడేవారు. ఈసారి గ్రామస్థాయిలో సచివాలయాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని తొలిరోజు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
వేరుశనగ రాయితీ విత్తనం కావల్సిన రైతులు గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ పద్దతిలో పేరు నమోదుచేసుకొని, డబ్బు చెల్లిస్తే రెండు రోజుల తరువాత విత్తనం అక్కడే ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి రైతుల పేర్ల నమోదును ప్రారంభించారు. అయితే సర్వర్లు మొరాయిస్తుండటంతో రైతులు రోజూ సచివాలయాలకు రావటం గంటల తరబడి వేచిచూసి వెనుతిరగాల్సి వస్తోంది. సోమవారం కూడా చాలా గ్రామాల్లో బయోమెట్రిక్ పేర్ల నమోదు ముందుకు సాగక వేలాది మంది రైతులు వేచి చూసి వెనక్కు వెళ్లారు. మరోవైపు ఏటా ఒక్కో రైతుకు నాలుగు బస్తాల వేరుశనగ ఇస్తుండగా, ఈసారి మూడు బస్తాలే ఇస్తుండటంతో ప్రజాప్రతినిధుల ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.