BRIDGE: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రెండు ప్రధాన మార్గాల్లోని రైల్వే అండర్ బ్రిడ్జిల మరమ్మతుపై రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించింది. గుంతకల్లు నుంచి కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం, కర్నూలు జిల్లాలోకి ప్రవేశించటానికి ప్రధాన మార్గంలోని రైల్వే వంతెన.. పెరిగిన ట్రాఫిక్ రద్దీకి తట్టుకోవటంలేదు. వంతెనను వెడల్పు చేయాలని ప్రజలు చాలా ఏళ్లుగా గుంతకల్లు మున్సిపల్, రైల్వే అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోతోంది. రైలు కింది వంతెన ప్రజలు తిరగటానికి కాదని.. కేవలం రైల్వే క్వార్టర్స్ నుంచి మురుగునీరు వెళ్లటానికేనని రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పారు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు ఆలయానికి, కర్నూలు జిల్లాకు వెళ్లటానికి ప్రధాన మార్గమని, రైల్వే అధికారుల మురుగునీటి వంతెన అని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
మరో అడుగు ముందుకేసిన రైల్వే అధికారులు వంతెన వద్ద మురుగునీటి వంతెనని, ప్రజలు తిరగటానికి కాదంటూ పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కసాపురం ఆలయానికి వెళ్లే మార్గంలోని వంతెన రహదారిని విస్తరించని కారణంగా రోజూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తోంది.