ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్గిపాడు ఆచారం.. ఆ ఒక్క రోజు ఊరంతా ఖాళీ - ఏపీ తాజా వార్తలు

TALARI CHERUVU : ఆధునిక సాంకేతికత ఉన్న సమాజంలోనూ ఆ గ్రామస్థులు సంప్రదాయాన్ని వీడలేదు. మాఘ మాస పౌర్ణమి ముందు రోజు ఊర్లో ఉంటే అరిష్టమని.. పూర్వం ఎప్పుడో జరిగిన ఒక దురదృష్ట సంఘటన పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో రోజంతా ఊరు వదలి.. అడవిలోకి పోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఆ ఊరు ఏంటి? వారి ఆచారం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం..

TALARI CHERUVU
TALARI CHERUVU

By

Published : Feb 6, 2023, 7:20 AM IST

TALARI CHERUVU : ఆశ..! క్యాన్సర్‌ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది అన్నాడో.. ఓ సినీ రచయిత. అదే రీతిలో అగ్గిపాడు అనే ఆచారం.. అరిష్టం నుంచి ఊరిని, ప్రజలను ఎన్నోఏళ్లుగా కాపాడుతోందంటున్నారు.. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామ వాసులు. ఇంతకీ ఆ వింత ఆచారం ఏంటి..? వారి వేధిస్తున్న సమస్య ఏంటో చూద్దాం రండి.

ఊరి బాగు, గ్రామస్తుల మేలు కోసం వింత నమ్మకాన్ని ఆచారంగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. అనంతపురం జిల్లాలోని తలారి చెరువు గ్రామస్తులు. మాఘ మాసం పౌర్ణమికి ముందు రోజున ఊరిలోని వారంతా పెంపుడు జంతువులతో సహా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతారు. అగ్గిపాడు అనే వింత ఆచారంలో భాగంగా ఊరిలోని అన్ని ఇళ్లల్లో అగ్గి, వెలుతురు లేకుండా దీపాలు ఆపేసి.. సమీపంలోని దర్గాకు చేరుకుంటారు. అలా పౌర్ణమి రోజంతా ఊరికి దూరంగా గడుపుతారు.

ఆ ఆచారం వెనుక ఓ కథ ఉంది. పూర్వం తలారిచెరువు గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడు దోచుకోవడంతో గ్రామస్తులంతా కలిసి ఆయనను హత్య చేశారు. నాటి నుంచి ఊరిలో పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోవడానికి.. బ్రాహ్మణుడిని హత్య చేయడమే కారణమని ఓ జ్యోతిష్యుడు తెలిపారు. పరిష్కార మార్గంగా మాఘచతుర్థశి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు అగ్గిపాడు ఆచారం పాటించాలని సూచించినట్లు గ్రామస్తులు వివరించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ సంప్రదాయం ఏటా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

"పౌర్ణమి ముందు రోజు నుంచి పౌర్ణమి రోజు అర్ధరాత్రి వరకూ ఇక్కడ ఉన్న హాజావలి దర్గాకు వస్తాం. రాత్రి 12 గంటలకు కరెంటు బంద్​ చేస్తే.. మళ్లీ తెల్లారి రాత్రి 12 గంటలకు కరెంట్​ ఆన్​ చేస్తాం. ఈ దర్గా దగ్గరే అందరం వండుకుని తింటాం. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఇళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత పూజలు చేసుకుంటాం. అనంతరం తెల్లారి ఎవరి పనులూ వారు చేసుకుంటారు"-గ్రామస్థులు, తలారి చెరువు

తలారిచెరువు గ్రామానికి దక్షిణం వైపు ఉన్న హాజావలి దర్గాకు వెళ్లి గ్రామస్తులు, పిల్లాపాపలు, పశువులతో కలిసి వనభోజనాలు చేసి రోజంతా అక్కడే గడుపుతారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకుని పూజ చేసుకుని ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. ఈ ఆనవాయితీని కొనసాగించడం వల్ల ఎలాంటి అరిష్టం లేకుండా సంతోషంగా ఉన్నామని గ్రామస్తులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details