అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరులో వజ్రాల కోసం అన్వేషణ మొదలైంది. పది రోజులుగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో వజ్రాలు దొరుకుతాయన్న ఆశతో ప్రజలు వెతుకులాట ప్రారంభించారు. వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు... వజ్రాల కోసం పొలాలను జల్లెడ పడుతున్నారు. ప్రతి ఏటా వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా మండలవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది ప్రజలు ఇక్కడకు వచ్చి వజ్రాలు వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
వర్షం వచ్చింది... వజ్రాల వేట మొదలైంది!
రాళ్లసీమలో రతనాల వేట మొదలైంది. తొలకరి జల్లులు పలకరించటంతో పొలాలపై ప్రజలు దండెత్తుతున్నారు. ఒక్క వజ్రమైనా దొరుకుతుందన్న ఆశతో రోజంతా వెతుకుతున్నారు. వజ్రాల అన్వేషణకు స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది తరలి వస్తున్నారు.
చాలామంది ఉద్యోగస్తులు సెలవులు పెట్టి మరీ వజ్రాలు వెతికేందుకు ఇక్కడకు తరలివస్తుంటారు. మహిళలు సైతం భోజనాలు ఇక్కడికే తీసుకొని వచ్చి రోజంతా వెతుకుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేకమంది గుంపులు గుంపులుగా ఏర్పడి వజ్రాల వేట చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే పొలాలంతా వజ్రాల వెతుకులాటకు వచ్చే వారితో నిండిపోతున్నాయి. ఒక్క వజ్రం దొరికితే చాలు తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు ఇక్కడి ప్రజలు. వజ్రం దొరికిన వారు గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారుల దగ్గరకు తీసుకొని వెళ్లి అమ్ముకుంటారు.