ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Demolition of Houses: వైసీపీ నేత స్వార్థం కోసం పేదల ఇళ్లు బలి - ఇంటి గోడల కూల్చివేత

Demolition Of House Walls: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక వైసీపీ నేత వెంచర్‌ కోసం ఏడు చోట్ల రహదారుల ఏర్పాటుకై పేదల ఇంటి గోడలు కూల్చటానికి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. పోలీసులతో కలిసి జేసీబీలతో గ్రామంలోకి ప్రవేశించారు. 50ఏళ్ల క్రితమే కట్టుకున్న తమ పక్కా ఇళ్ల కూల్చివేతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : May 24, 2023, 10:54 PM IST

వైసీపీ నాయకుడి స్వార్థం కోసం పేదల ఇళ్లు బలి

Demolition Of House Walls For YCP Leader's Venture: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలో భూములకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. వేలల్లో ఉన్న సెంటు స్థలం భూమి ప్రస్తుతం లక్షల రూపాయలు పలుకుతోంది. దీంతో చాలా మంది రైతులు భూములు స్థిరాస్తి వ్యాపారులకు విక్రయాలు చేస్తున్నారు. అయ్యవారిపల్లిలో మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి ఇంటి పట్టాలు పొంది పక్కా గృహాలు నిర్మించుకొని గ్రామీణులు వ్యవసాయంతో జీవనం చేస్తున్నారు. ఆ గ్రామంలో 420 సర్వేనెంబర్‌లో 6 ఎకరాల 70 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో వెంచర్ వేసి ఇళ్ల స్థలాలు విక్రయించటానికి నిర్ణయించారు. ఈ భూమికి అయ్యవారిపల్లె రహదారికి మధ్య ఒక వరుసలో ప్రభుత్వ పట్టాలు పొంది ఇళ్లు నిర్మించుకుని పేదలు నివసిస్తున్నారు. ఈ ఇళ్ల గోడలను తొలగిస్తే ఆ భూమిలో వేస్తున్న వెంచర్ ప్లాట్లకు మంచి డిమాండ్ వస్తుంది. దీంతో రాప్తాడులోని వైసీపీ నాయకుడు రంగంలోకి దిగి, అక్కడ ఉన్న ఇళ్ల గోడలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిపాదిత వెంచర్ భూమిలోకి వెళ్లేలా 7రహదారులు ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో మండల రెవెన్యూ అధికారి ఆగమేఘాల మీద పోలీసులతో గ్రామంలో ఇళ్ల చుట్టూ నిర్మించుకున్న ప్రహరీలను కూల్చుతున్నారు. కూల్చివేతలపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదల్లో చాలామంది సీఎం జగన్‌ ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో పది వేల రూపాయలు చెల్లించారు. అలాగే ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ఆస్తి హక్కు పత్రాలన్నీ ఇళ్లు నిర్మించుకున్న పేదల దగ్గర ఉన్నాయి. అయినా ఇంటి పట్టాలు బోగస్ అంటూ పోలీసులతో కలిసి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని బాధిత గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ పటంలోనూ బండి రస్తా ఎక్కడనేది స్పష్టంగా ఉన్నప్పటికీ, ఎదురు మాట్లాడితే కేసులు పెడతామని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు. నిస్సహాయురాలైన ఓ మహిళ ఏమీ చేయలేక పోలీసులకు భయపడి రసాయన ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను గ్రామస్థులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.

అధికారులు మాత్రం వారి దగ్గర ఉన్న పక్కా ఇళ్లు పత్రాలను పరిశీలిస్తున్నామని.. చెబుతున్నారు. వారి సొంత ఆస్తి కాకుండా మిగిలిన రస్తా ప్రాంతాన్ని గుర్తించి రహదారులు వేస్తున్నామని అంటున్నారు.

స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సరిగ్గా స్పందించలేదని బాధితులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు దౌర్జన్యంగా పేదల ఇళ్ల గోడలు కూల్చివేతకు వెళ్లటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details