Municipal Workers Families Pathetic Situation: అనంతపురం నగరపాలక సంస్థలో మృతి చెందిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన కార్మికులు అనేకమంది అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. కరోనాకు ముందు కూడా అనేక మంది పారిశుధ్య కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారు. అనంతపురంలో మొత్తం 35 మంది పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. ఈ కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన ఈపీఎఫ్ సొమ్మును మృతుల కుటుంబాలకు ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో మృతుల కుటుంబాలు ఏళ్ల తరబడి నగరపాలక సంస్థ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబాలు కనీసం పిల్లలను చదివించుకునే పరిస్థితిలో కూడా లేకపోవటం, మరికొన్ని కుటుంబాలు పోషణ భారమై అల్లాడిపోతున్నారు.
ఎన్నో ఏళ్లుగా పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. మా కుటుంబాలకు ఈపీఎఫ్ తరపున ఎటువంటి సొమ్ము అందలేదు. ఈఎస్ఐ ప్రయోజనం కూడా రాలేదు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు పట్టించుకొని.. మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. - బాధిత కుటుంబ సభ్యురాలు
నా భర్త మున్సిపాలిటీలో డ్రైవర్గా పనిచేసేవారు. అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి.. కుటుంబ పోషణ కష్టంగా మారింది. పిల్లలను చదివించుకోవడం ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. - బాధిత కుటుంబ సభ్యురాలు