అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమందేపల్లి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రౌడీ ఎమ్మెల్యే రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై దౌర్జన్యం చేస్తున్న నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్ఐ పాషావలికు వినతిపత్రం అందజేశారు.
రాజకీయ లబ్ధి కోసమే కలెక్టర్‌పై ఆరోపణలు
రాజకీయ లబ్ధి కోసమే కలెక్టర్‌పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపణలు చేశారని చిలేవారిపల్లి గ్రామస్థులు ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చీలేవారిపల్లి గ్రామంలో శ్రీకాట కోటేశ్వరస్వామి ఊరేగింపు విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌ని కలిసి తమ ఊరి సమస్యపై విన్నవించారు. తమ గ్రామంలో జరిగిన వివాదానికి జిల్లా కలెక్టర్‌కు ఎటువంటి సంబంధం లేదని... కొంతమంది రాజకీయ లబ్ధి కోసం లేనిపోని ఆరోపణలు చేశారని గ్రామస్థులు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.