జిల్లాలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం కరవైంది. రాయితీ పథకాలు అందకుండా పోతున్నాయి. గతంలో పాల ఉత్పత్తి పెంచేందుకు దాణా, దాణామృతం, మాగుడు గడ్డి రాయితీతో ఇచ్చారు. మేలుజాతి పశువులను అందించారు. జిల్లా అంతటా పాలశీతలీకరణ కేంద్రాల ద్వారా పాలు సేకరించి, పాడి పరిశ్రమను ఆదుకున్నారు. ప్రస్తుతం అంతా తారుమారైంది. డెయిరీలను మూసేశారు. పశు పథకాల గురించి మరిచిపోయారు. రాయితీలను అటకెక్కించారు. కనీసం గడ్డిపోచ కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు పశువైద్యులే చెప్పడం గమనార్హం. నిధులు రాక.. పథకాలు అమలుకాక అటు అధికారులు, ఇటు పశు పోషకులు అయోమయంలో పడ్డారు.
ఏడాదిగా నిధుల్లేవ్!
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశునష్ట పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 సెప్టెంబరులో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి 5 పశువులు, 20 గొర్రెలు, మేకల వరకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. పశువు చనిపోతే రూ.30 వేలు, గొర్రె, మేక చనిపోతే రూ.6 వేలు చొప్పున పోషకులు, కాపర్లకు తొలి ఏడాదిలో పంపిణీ చేశారు. ఆ తర్వాత నిధులు ఆగిపోయాయి. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నామని పలువురు పశువైద్యులు చెబుతున్నారు. ఈ పథకానికి ఏడాది నుంచి నిధులు ఆగిపోయాయి. దీంతో ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడం లేదు.
జిల్లాలో రెండేళ్లలో 8 వేల పశువులు చనిపోయాయి. ఒక్కో పశువుకు రూ.30 వేలు చొప్పున రూ.24 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా.. 2,619 పశువులకు రూ.7.85 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 5,351 పశువులకు రూ.16.15 కోట్లు చెల్లించాల్సి ఉంది.జిల్లాలో 2,790 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. ఒక్కో గొర్రె, మేకకు రూ.6 వేల చొప్పున రూ.1,67,40,000 పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,071 గొర్రెలు, మేకలకు రూ.64.26 లక్షలు అందించారు. ఇంకా 1,719 గొర్రెలు, మేకలకు రూ.1,03,14,000 పరిహారం కాపరులకు ఇవ్వాల్సి ఉంది.
పశుగ్రాసం ఎక్కడ..?
పాల ఉత్పత్తి పెంచేందుకు ఏటా పశువులకు మాగుడుగడ్డి (సైలేజ్ బేళ్లను), దాణా, దాణామృతం, వివిధ రకాల గడ్డి విత్తనాలను రాయితీతో అందించేవారు. ఏటా పశుశాఖ అధికారులతో టన్నులకొద్దీ రైతులు కొనేవారు. ప్రస్తుతం గడ్డి విత్తనాలు తప్ప ఏమీ ఇవ్వడంలేదు. గడ్డి విత్తనాలు, గడ్డి పెంపకానికి ఈ ఏడాది ఉపాధిహామీ పశుగ్రాస పథకం కింద బహువార్షిక పశుగ్రాస రకాలు పెంచేందుకు 1,100 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎకరా గడ్డి పెంచేందుకు రెండేళ్లకు రూ.83,654 ఇస్తారు. ఐదెకరాల్లోపు ఉన్న రైతులు అర్హులు. ఈ ప్రక్రియ దరఖాస్తులు, ఆన్‌లైన్ నమోదు దశలోనే ఉంది.
అందని చేయూత