అనంతపురం భైరవనగర్‌కు చెందిన టి.భరత్‌రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు వివరాలు వెల్లడించారు.
ఇదీ నేర చరిత్ర..
భరత్‌రెడ్డి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిసగా మారాడు. ఎలాంటి సంపాదన లేకపోవడంతో మోసాల బాట పట్టాడు. ఫేస్‌బుక్, టిండర్ యాప్, తెలుగు మాట్రిమోనిలలో నకిలీ ఐడీలతో సిద్ధార్థరెడ్డి పేరుతో ఖాతాలు తెరిచాడు. అందమైన యువకుడి ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతా ప్రొఫైల్ ఫొటోగా పెట్టాడు. ఈ నకిలీ ఖాతా ద్వారా యువతులకు పరిచయం అయ్యాడు. చాటింగ్‌లు, వాయిస్ కాల్స్ కొనసాగించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. గుడ్డిగా నమ్మిన యువతుల నుంచి నగ్న దృశ్యాలు, వీడియోలను రికార్డ్ చేయించుకొని తన మొబైల్‌కు తెప్పించుకునేవాడు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను నమ్మించాడు. సుమారు రూ.5 లక్షల వరకు అమ్మాయిల నుంచి తన బ్యాంకు ఖాతాలోకి, ఫోన్‌పే, గూగుల్ పే ఖాతాలకూ నగదు బదిలీ చేయించుకున్నాడు. సుమారు 20 మంది యువతులు బాధితులుగా ఉన్నారు. ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వంచనకు గురయ్యారు. అంతేకాకుండా యువతులు, మహిళలు స్నానం చేసే సమయాల్లో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించేవాడని, గంజాయి విక్రయాలకూ పాల్పడేవాడు. నిందితుడిపై ఇప్పటికే అనంతపురం ఒకటి, రెండో పట్టణ పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు.