అనంతపురం జిల్లాలో నైరుతి రుతుపవనాల కాలంలో 338 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఈసారి 567 మిల్లీ మీటర్లు కురిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 68 శాతం అధిక వర్షం నమోదైంది. అతివృష్టి వర్షాలతో ఖరీఫ్‌లో సాగు చేసిన వేల హెక్టార్లలో పంటలు చేతికి రాకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా రైతులు కోట్ల రూపాయల విలువైన పంటలు కోల్పోయారు. వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, టమోటా పంటలకు తీవ్రంగా నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖలు అంచనావేశాయి.
అతివృష్టి వర్షాలతో అనంతపురం రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. ఆగస్టు నెలలో ఇరవై రోజుల పాటు విరామం ఇచ్చిన వర్షాలు.. రైతులను ఒకింత ఆందోళనకు గురిచేశాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి మూడు విడతలుగా పదిహేను రోజులు కురిసిన వర్షాలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనంతపురం జిల్లాలో సాధారణంగా 338 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాలి. ఈసారి ఆ నెలల్లో 567 మి.మీ కురిసింది. ఏటా లోటు వర్షపాతం నమోదయ్యే అనంత జిల్లాల్లో ఈసారి ఖరీఫ్ సీజన్ లో 68 శాతం అదనంగా వర్షం కురిసింది.
2010 లో ఖరీఫ్ సీజన్లో 404 మి.మీ వర్షపాతం నమోదు కాగా, దాన్ని తిరిగరాసేలా ఈ ఏడాది 567 మిల్లీ మీటర్లు కురిసింది. అధిక వర్షాలతో పెట్టుబడి పూర్తిగా కోల్పోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా కురవాల్సిన వర్షం అక్టోబర్ నాటికే కురిసినట్లు అర్థగణాంకశాఖ అధికారులు చెబుతున్నారు. కుండపోత వానలు అన్నదాతల పెట్టుబడిని జలసమాధి చేశాయి. అధిక పెట్టుబడితో సాగుచేసిన మిరప, వేరుశనగ, పత్తి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.