అనంతపురం జిల్లా రైతులను అకాల వర్షాలు మరోసారి దెబ్బతీశాయి. కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లో దాదాపు అన్ని గ్రామాల రైతులూ తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు వరి కోసి కుప్పగా వేసుకోగా..మరికొందరు నూర్పిడి చేసుకొని ధాన్యం రాశులుగా పోశారు. ఆ సమయంలోనే వర్షం రావడంతో కొంత ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. మరికొంత ధాన్యం తడిచి మొలకలు వస్తున్నాయి.
నల్లచెర్వు మండలంలోని రెండు గ్రామాల్లో 27 హెక్టార్లలో వరిపంట పూర్తిగా వాలిపోయింది. 33 శాతం కన్నా తక్కువ పంట నష్టం జరిగితే... ఆ రైతుల పేర్లు పరిహారం జాబితాలో అధికారులు నమోదు చేయడం లేదు. పంట దశలో ఉన్నది మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని.. తడిసిన ధాన్యం కుప్పలు, మొలకొస్తున్న ధాన్యాన్ని లెక్కలోకి తీసుకోబోమని అధికారులు చెప్తున్నారు.