బలవంతపు భూసేకరణ అపాలి: సీపీఎం - అనంతపురం జిల్లాలో సీపీఎం ఆందోళన
రైతులు సాగు చేసుకుంటున్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఇళ్ల స్థలాల కోసం సేకరించడాన్ని సీపీఎం నాయకులు తప్పుబట్టారు. భూ సేకరణ ఆపాలని కోరుతూ అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఆందోళనకు దిగారు.

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని మణికంఠ కాలనీ సమీపంలోని సర్వేనెంబర్ 744లో 14 మంది రైతులు సాగుచేసుకుంటున్న 13.6 ఎకరాల ప్రభుత్వ భూమిని... రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల నివాస గృహాల కోసం భూసేకరణ చేపట్టింది. సాగులో ఉన్న రైతులకు అన్యాయం చేసి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టడం ఆపాలని సీపీఎం కార్యవర్గ సభ్యుడు ఓబుల కొండారెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వం సేకరించిన భూమిలో సీపీఎం నాయకులు, రైతులు ఆందోళనకు దిగారు. భూమి చదును చేసే పనులు ఆపాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. ధర్నా ఆపకపోవడంతో పోలీసులు బలవంతంగా సీపీఎం నాయకులు రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.