అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. మార్చి 29న పదేళ్ల బాలుడిలో వైరస్ కనిపించింది మొదలు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1234 మందికి ఈ వైరస్ సోకింది. హిందూపురం కేంద్రంగా.. దిల్లీ నుంచి తిరిగివచ్చిన వారి నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందిన వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పెద్దఎత్తున పాకుతోంది. ముంబయి నుంచి వచ్చిన వలస కూలీల్లో వంద మందికి పైగా వైరస్ బయటపడింది. వారిద్వారా గ్రామాలకూ విస్తరించింది. జిల్లాలో విదేశీయులు రాకపోకలు సాగించే మూడు ప్రధాన కేంద్రాల ద్వారా స్థానికులకు వైరస్ సోకి, తద్వారా విస్తృత వ్యాప్తికి కారణమైంది. ఈ వైరస్ ఇంతటితో ఆగకుండా జైళ్లకు కూడా పాకుతోంది. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి జైళ్లకు రిమాండ్ నిందితుల ద్వారా అప్పటికే జైలులో ఉన్న ఖైదీలకు సోకినట్లు తెలుస్తోంది. జూలై నెలలో నాలుగు వేలమందికి వైరస్ సోకే అవకాశం ఉందని అంచనా వేసిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వైద్యం కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
లాక్డౌన్, భౌతిక దూరం వంటి చర్యలతో అదుపులోనే ఉందనుకున్న కొవిడ్-19 ఇప్పుడు విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు మొదలు పల్లెల్లో పొలం పనులు చేసుకునే వారి వరకు వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్ నెలంతా హిందూపురం కేంద్రంగా దిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారి ద్వారా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన వైరస్ ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. హిందూపురంలోని పలు కాలనీల్లో రెండు వందల మందికి పైగా వైరస్ సోకింది. వారిద్వారా వైద్యులు, నర్సులు ఇలా అందరికీ సోకిన పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది. హిందూపురంలో పరిస్థితి అదుపులోకి వస్తుందనుకునే సమయంలో ముంబయి నుంచి 968 మంది వలస కూలీలను తీసుకొచ్చిన రైలు, వైరస్‌ను కూడా మోసుకొచ్చిందని అధికారులు గుర్తించలేకపోయారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. హిందూపురం జైలులో ఆరుగురు ఖైదీలకు వైరస్ సోకిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
వైరస్ వ్యాపించిందిలా..
వలస కూలీలను ఉంచిన ఉరవకొండ, విడపనకల్లులోని క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో వారంతా తీవ్రంగా నిరసన వ్యక్తంచేశారు. దీనికి తోడు ఆయా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయకపోవటంతో వలస కూలీలు తమ బంధువులతో కలిసి భోజనం చేస్తూ, విచ్చలవిడిగా వెలుపల తిరిగారు. ఫలితంగా వైరస్ స్థానికంగా చాలా మందికి సోకింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వృద్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించకుండానే బంధువులకు అప్పగించారు. ఇలా మృత దేహాలకు అంత్యక్రియలు చేసిన వారు కూడా వందల సంఖ్యలో వైరస్ బాధితులుగా మారిపోయిన వైనానికి నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. వైరస్ సోకిన బాధితుల సంఖ్యను ప్రకటించటంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం గోప్యతగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు జిల్లా యంత్రాంగం తీరుతో కిందిస్థాయి అధికారుల్లో అప్రమత్తత లోపించి, ప్రజల్లో వైరస్ పట్ల నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయి వేగంగా వ్యాప్తికి కారణమవుతోంది. ఇది ఇంతటితో ఆగదని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి చెబుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో మూడు రోజులుగా అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట 97 మందికి వైరస్ సోకినట్లు నిర్థరణ కాగా, వరుసగా 70, 68 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇవాళ కొత్తగా జిల్లాలో 90 మంది వైరస్ బారిన పడినట్లు ప్రయోగశాల నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో దిల్లీ వెళ్లివచ్చిన వారి ద్వారా విస్తరిస్తున్న విషయం గుర్తించే లోపే, విదేశీయుల రాకపోకలు ఎక్కువగా ఉండే పుట్టపర్తి, ఆర్డీటీ, కియా పరిశ్రమలకు వచ్చిన వారు స్థానికంగా ఎక్కువ మందికి వైరస్ అంటించినట్లు నిర్థరణ అయింది.