ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లెక్కల్లోనే పడకలు.. చిక్కుల్లో రోగులు! - అనంతపురంలో కరోనా కేసులు

అధికారులు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించాం.. బాధితులకు తక్షణ వైద్యం అందిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ఫ. వాస్తవ పరిస్థితులు గ్రహించడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. మంచాలు ఖాళీ లేవంటూ వెనక్కి పంపించేస్తున్నారు. ఫలితంగా పలువురు మృత్యువాత పడుతున్నారు.

atp_hospitals
atp_hospitals

By

Published : Aug 5, 2020, 10:56 AM IST

‘వైద్యం కోసం ఎవరు వచ్చినా వెనక్కి పంపించొద్ధు ఓపీ చీటీ, ఇతర పత్రాలు అంటూ కాలయాపన చేయొద్ధు రోగి వచ్చిన వెంటనే వైద్యం ప్రారంభించాలి. అత్యవసర వైద్యం అందక రోగులెవరూ చనిపోకూడదు. అన్ని సౌకర్యాలూ సమకూరుస్తున్నాం. అన్ని రకాల పడకలూ అందుబాటులో ఉన్నాయి. అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి బాధితుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలి. ఇదీ కలెక్టర్‌ గంధం చంద్రుడు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు.. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కరోనా సోకిన వారికి అత్యవసర వైద్యం అందని ద్రాక్షలానే మారింది. చికిత్స కోసం వస్తున్న రోగులకు పడకలు అందుబాటులో లేవని వెనక్కి పంపించేస్తున్నారు. ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడా చేర్చుకోవడం లేదు. రాత్రి సమయాల్లో వచ్చే బాధితుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అత్యవసర చికిత్స అందక కొందరు మృత్యువాత పడుతున్నారు.

అనంతపురం జిల్లాలో.. అధికారులు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించాం.. బాధితులకు తక్షణ వైద్యం అందిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ఫ. వాస్తవ పరిస్థితులు గ్రహించడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. మంచాలు ఖాళీ లేవంటూ వెనక్కి పంపించేస్తున్నారు. ఫలితంగా పలువురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. కొవిడ్‌ బాధితులకు వైద్యం అందించడానికి జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి, గుంతకల్లు, కదిరి ప్రాంతీయ ఆసుపత్రులు, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఎంపిక చేశారు. వీటిలో సర్వజన ఆసుపత్రి, హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బత్తలపల్లి ఆర్డీటీ, కిమ్స్‌-సవీరా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కొవిడ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసినా.. వాటిలో బాధితులను చేర్చుకున్న దాఖలాలు లేవు.

జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండు రోజుల కిందట పాజిటివ్‌ వచ్చింది. అంబులెన్సు రాకపోవడంతో మంగళవారం స్వయంగా ట్రయేజింగ్‌ సెంటర్‌కి వెళ్లారు. బత్తలపల్లి ఆర్డీటీకి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆర్డీటీ దగ్గర నాలుగైదు గంటలు వేచిచూసినా పడకలు ఖాళీ లేకపోవడంతో వెనుదిరిగి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

కళ్యాణదుర్గానికి చెందిన ఓ వృద్ధుడికి సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయాసం ఎక్కువ కావడంతో సర్వజనాసుపత్రికి వచ్చారు. రెండు గంటలు గడిచినా పడకలు లేవంటూ చేర్చుకోలేదు. ఆఖరికి ఆ వృద్ధునితో వచ్చిన సహాయకుడు ఉన్నతాధికారులకు విన్నవించుకోగా పడక దొరికింది. ఆ వృద్ధుడు అర్ధరాత్రి దాటాక మృతి చెందారు.

ప్రకటనలతోనే సరి

జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రుల్లో జనరల్‌ 1,209, ఆక్సిజన్‌ 1,220, ఐసీయూ 308, వెంటిలేటర్‌ 57 చొప్పున పడకలు సిద్ధం చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 60 శాతం పడకలు ఖాళీగా ఉన్నట్లు వెబ్‌సైట్‌లో చూపుతున్నారు. ప్రారంభానికి నోచుకోని ఆసుపత్రుల్లోనూ ఖాళీలు ఉన్నట్లు చూపించారు. సర్వజనలో 931 పడకలు కొవిడ్‌ రోగులకు కేటాయించినట్లు పేర్కొన్నా.. అక్కడ 414 పడకలను మాత్రమే బాధితులకు ఇచ్చారు. మిగిలిన పడకలపై ఇతర రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మారుస్తామని, ఇతర రోగులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని అధికారులు ప్రకటించినా ఆచరణలోకి రాలేదు.

ఖాళీల సమాచారం లేదాయె

కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి మొత్తం 38 ఆసుపత్రులను ఎంపిక చేశారు. కరోనా బాధితులను మొదట ట్రయేజింగ్‌ సెంటరుకు పంపిస్తారు. అక్కడి వైద్యులు పరీక్షించి, రోగుల పరిస్థితిని బట్టి ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. అయితే అక్కడి వైద్యుల దగ్గర ఏ ఆసుపత్రిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం లేదు. మెరుగైన చికిత్సకు ఎక్కడ సరైన సౌకర్యాలు ఉన్నాయనే వివరాలు లేవు. సోమవారం రాత్రి ఎస్కేయూ నుంచి నలుగురు కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురికి ఆయాసం ఎక్కువగా ఉందని, తాము చికిత్స చేయలేమని వైద్య సిబ్బంది చెప్పడంతో మరో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

పరిస్థితి చక్కదిద్దేనా?

జిల్లాలో కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్వాస సంబంధ సమస్యలు తీవ్రమై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులకు వస్తున్న రోగులకు తక్షణ వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. వీరికి సకాలంలో వైద్యం అందేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని పడకలు, అందులో ఖాళీలు తదితర వివరాలను ప్రదర్శించేలా బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. రోగులకు సమగ్ర సమాచారం తెలిస్తే అత్యవసర సమయంలో ఆయా ఆసుపత్రులను ఆశ్రయించే వీలు ఉంటుంది.

ఆఖరి నిమిషంలో వస్తున్నారు

సర్వజన ఆసుపత్రిలో 414 పడకలు కొవిడ్‌ చికిత్సకు కేటాయించారు. అయినా సోమవారం 456 మందికి చికిత్స అందించాం. మిగిలిన పడకలపై ఇతర రోగులకు వైద్యం అందిస్తున్నాం. అత్యవసర రోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పరిస్థితి విషమించిన తర్వాత ఆఖరి నిమిషంలో రావడం వల్లే మృత్యువాత పడుతున్నారు. లక్షణాలు బయటపడగానే వస్తే ప్రాణాలు కాపాడగలం. - రామస్వామినాయక్‌, అనంత సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఇదీ చదవండి:అత్యున్నత పరీక్షలో ఉన్నతంగా.. నిలిచి గెలిచిన తెలుగు తేజాలు..!

ABOUT THE AUTHOR

...view details