అనంతపురం జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు 1500 పడకలతో తాత్కాలిక ఆసుపత్రి సిద్ధమవుతోంది. కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే ఇక్కడకు తీసుకువచ్చి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రామినేపల్లి వద్ద వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి నిర్మించిన 5 భారీ గోదాముల్లో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 9 కోట్లు కేటాయించింది.
ఆగస్టు 15 నాటికి ఆ తాత్కాలిక ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకు రావాలని అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సివిల్, ఎలక్ట్రికల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 300 మంది కూలీలు పనిచేస్తున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరు కంపార్ట్మెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 125 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. 200 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. నీటి సౌకర్యం కోసం 4 బోర్లు వేయగా రెండింటిలో నీళ్లు వస్తున్నాయి.