అనంతపురంం జిల్లా హిందూపురం పట్టణంలోని గుడ్డం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైలు కిందపడి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని లేపాక్షి మండలం కోడి పల్లి గ్రామానికి చెందిన గిరీష్ (27), స్వాతి (21) గా పోలీసులు గుర్తించారు. వారికి వివాహం జరిగి రెండేళ్లు కావొస్తోంది. అన్యోన్యంగా ఉంటున్న ఆ జంట మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్ర గాయాలపాలై హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రి ప్రాంగణం మృతుల బంధువుల రోదనలతో మిన్నంటింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.