ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేయి తడిపితేనే సేవలు.... మసకబారుతున్న విద్యుత్తుశాఖ ప్రతిష్ట

ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందన్న అంశంపై ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. అవినీతిలో విద్యుత్తుశాఖ మొదటి స్థానంలో ఉందని సర్వే ద్వారా ప్రకటించింది. అనంతపురం జిల్లాలో కొన్ని పరిస్థితులు పరిశీలిస్తే.. ఇది నిజమని నమ్మక తప్పదు. పలువురు అధికారులు, ఉద్యోగుల అవినీతి వెలుగులోకి వస్తుండటమే ఇందుకు నిదర్శనం.

Corruption in the Anantapur power department
చేయి తడిపితేనే సేవలు

By

Published : Dec 8, 2020, 11:53 AM IST

ప్రభుత్వ కొలువులో చేరి.. ప్రజలకు సేవ చేయాలి. అది మానేసి.. అభిమానం తాకట్టు పెట్టేసి.. రూ.లక్షలు పట్టేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ప్రజలకు సేవ చేయటం మాని.. విధి నిర్వహణ వదిలి.. లంచాలకు అలవాటు పడుతున్నారు. కొందరు విద్యుత్తు అధికారులు, ఉద్యోగుల తీరు వల్ల విద్యుత్తుశాఖ అప్రతిష్టపాలవుతోంది. రూ.లక్షల్లో వేతనం వస్తున్నా.. ప్రజల సొమ్ముకు ఆశపడుతున్నారు.

  • రైతులకు రెండు వ్యవసాయ నియంత్రికలు విడుదల చేసేందుకు గుంతకల్లు సబ్‌ డివిజన్‌ డీఈఈ రవిబాబు పోల్‌ టు పోల్‌ వర్కర్‌ ద్వారా రూ.1.50లక్షలు డబ్బులు తీసుకుంటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. సదరు డీఈఈ, పోల్‌ టు పోల్‌ వర్కర్‌ అవినీతిపై డీఈటీ పరంధామయ్యతో విచారణ చేయించి, ఉన్నతాధికారులు వారిని సస్పెండ్‌ చేశారు.
  • పెనుకొండ ఇన్‌ఛార్జి ఏఈఈగా పనిచేస్తున్న బాషా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు రావటంతో విచారణ చేయించారు. విచారణలో అవినీతి రుజువు అవటంతో సదరు అధికారిని సస్పెండ్‌ చేశారు.
  • వజ్రకరూరు సెక్షన్‌ ఏఈఈ వ్యవసాయ కనెక్షన్ల విడుదలకు సంబంధించి రైతులతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అధికారులకు వచ్చాయి. దీంతో సదరు ఏఈఈపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ అధికారులకు ఆదేశాలు అందాయి. సదరు ఏఈఈపై విచారణ సాగుతోంది.
  • హిందూపురంలో పనిచేసిన ఒక అధికారి అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యుత్తు విజిలెన్స్‌ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే సదరు అధికారి అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.
  • రెండు నెలల కిందట కనగానపల్లి సెక్షన్‌ ఇన్‌ఛార్జి ఏఈఈ అదనపు నియంత్రిక ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి రూ.80వేల మొత్తాన్ని తీసుకున్నారు. అదనపు నియంత్రిక ఏర్పాటు చేయకుండా తిప్పుకొంటుండటంతో రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన అధికారి తన బంధువు ఫోన్‌-పే ద్వారా రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేశారు. సదరు ఏఈఈతో పాటు కదిరి డివిజన్‌లో పనిచేస్తున్న ఒక లైన్‌మెన్‌పై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.

పనేదైనా.. పైసలే!

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయాలన్నా.. ఇళ్లకు మీటర్లు ఇవ్వాలన్నా.. స్తంభాలు, కండక్టరు తదితర ఏ సామగ్రి కేటాయించాలన్నా.. ఉద్యోగుల నుంచి అధికారుల వరకు రైతులు, వినియోగదారులు చేయితడపాల్సిన పరిస్థితి విద్యుత్తుశాఖలో నెలకొంది. నియంత్రిక కాలిపోయినా.. మరమ్మతులు చేసి తిరిగి రైతుల పొలంలో ఏర్పాటు చేయాలన్నా.. అంతో ఇంతో పైకం ముట్టజెప్పాల్సిందే. విద్యుత్తుశాఖలో అందించే సేవలన్నింటికీ ఒక ధర పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు కొందరు ఉద్యోగులు. డబ్బు ఇచ్చిన వారికి ముందుగా సామగ్రి, నియంత్రికలు ఇస్తూ పెద్దఎత్తున డబ్బు సంపాయిస్తున్నారు కొంతమంది ఉద్యోగులు, అధికారులు. వీరిపై ఫిర్యాదులు వస్తే తప్ప విచారణ చేయించకపోవటంతో ధీమాగా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. విద్యుత్తుశాఖలో అవినీతికి పాల్పడుతూ 14మంది అధికారులు, ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులను తొలగించగా.. మరికొందరి కేసులు విచారణలో ఉన్నాయి.

ఒకే ఒక్క ఫిర్యాదు..

విద్యుత్తు సేవలు అందించటంలో ఉద్యోగి, అధికారి ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై రాతపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసేందుకు జిల్లాలో ఉన్న ప్రతి విద్యుత్తు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు మాత్రమే రావటం గమనార్హం. వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఈ ఫిర్యాదు పెట్టెలో తమ ఫిర్యాదులను రాసి వేయొచ్ఛు నెలలో రెండు సార్లు ఫిర్యాదు పెట్టెలను అధికారులు తెరచి చూస్తారు. వచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారులకు పంపుతారు. ఫిర్యాదులలో అంశాలను బట్టీ విచారణ చేయించి సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.

మార్పు ఏదీ..?

కొంతమంది అధికారులు, ఉద్యోగులు సేవలందించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని రైతులు, వినియోగదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. స్పందించి విచారణ చేయించి అవినీతికి పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. అవినీతి జలగలపై చర్యలు తీసుకుంటున్నా.. శాఖలో పనిచేస్తున్న మిగిలిన వారిలో ఎలాంటి మార్పు రావటం లేదు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయిన అధికారి, ఉద్యోగులు నెలల వ్యవధిలోనే తిరిగి పోస్టింగ్‌లు తెచ్చుకుని తాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటమే.

చర్యలు తీసుకుంటాం..

విద్యుత్తుశాఖలో ఎలాంటి సేవలు పొందాలన్నా.. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులకు రైతులు, వినియోగదారులు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బు అడిగితే అలాంటి వారిపై రాతపూర్వకంగా ఈఈలతో పాటు, నాకు గాని ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. కొంతమందిపై ఫిర్యాదులు రావటంతో విచారణ చేయిస్తున్నాం. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే వారిని సస్పెండ్‌ చేస్తున్నాం. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకే పనిచేస్తున్నాం. తప్పుచేసే వారిని ఉపేక్షించేది లేదు. గుంతకల్లు సబ్‌డివిజన్‌ డీఈఈ రవిబాబు, పోల్‌టుపోల్‌ వర్కర్‌ ఆదినారాయణరెడ్డి వ్యవహారంపై డీఈటీ పరంధామయ్యతో విచారణ చేయించాం. నివేదిక ఆధారంగా ఇద్దరిని సస్పెండ్‌ చేశాం. - వరకుమార్‌, ఎస్‌ఈ, విద్యుత్తుశాఖ

ఇదీ చదవండి:

వృద్ధులకు రాయితీలిచ్చి గౌరవిస్తే సరిపోదు..: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details